
బడ్డీకొట్టు తొలగించేందుకు టీడీపీ నేత కుట్ర
నల్లజర్ల: కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై మొదలైన వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని గ్రామాల్లో సైతం పేదలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దూబచర్లలో బుధవారం జరిగిన ఈ ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. డైట్ కళాశాలకు వెళ్లే దారిలో దొబ్బిడి పెద్దిరాజు సుమారు 15 ఏళ్లుగా పాన్‌షాపు పెట్టుకుని, అక్కడే కొబ్బరి బొండాలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం పంచాయతీ కార్యదర్శి తమ సిబ్బంది, పోలీసులతో వచ్చి ఆ బడ్డీకొట్టు తొలగించాలంటూ హంగామా చేశారు. దీంతో తమ జీవనాధారం పోతుందనే మనస్తాపంతో పెద్దిరాజు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని తొలుత నల్లజర్ల తర్వాత మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై పెద్దిరాజు భార్య రాణి మాట్లాడుతూ తాము వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమని తమ కొట్టు ఖాళీ చేయించడానికి కూటమి నాయకులు కుట్ర పన్నారన్నారు. ఆరు నెలల క్రితం టీడీపీ నాయకుడు తమ బడ్డీ వెనుక షాపు పెట్టారని, దానికి తమ బడ్డీ అడ్డుగా ఉందని తొలగించడం కోసం పంచాయతీ, పోలీసు సిబ్బందితో ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రహదారి పక్కనే ఉన్న ఆక్రమణలను తొలగించాలనుకుంటే గ్రామంలో అన్ని దుకాణాలను తీసివేయాలన్నారు. అంతేగానీ తమపై కక్ష కట్టి, కేవలం తమ బడ్డీకొట్టునే టార్గెట్ చేశారని ఆరోపించారు. దీనిపై గ్రామ కార్యదర్శి ఆషాలేఖ్యను వివరణ కోరగా ఆ రహదారిలో వెళ్లే లారీలకు ఆ బడ్డీకొట్టుపై ఉన్న చెట్టు కొమ్మలు అడ్డంకిగా ఉన్నాయన్నారు. వాటిని తొలగించాలని పలుమార్లు వారికి చెప్పిన వినకపోవడంతో, ఆ కొమ్మలు తొలగించడానికి మాత్రమే వెళ్లామని వివరణ ఇచ్చారు.
పంచాయతీ సిబ్బంది, పోలీసుల హడావుడి
ఆత్మహత్యాయత్నం చేసిన బాధితుడు
వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు
కావడంతో టార్గెట్