
అర్బన్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఆచార్యులు
కొత్తపేట: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ అర్బన్ డెవలప్‌మెంట్స్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన హైకోర్టు న్యాయవాది రామోజు నాగ వెంకట సత్య కామాచార్యులు (ఆర్‌కే ఆచార్యులు) నియమితులయ్యారు. ఆ మేరకు సెక్రటరీ లీగల్ అండ్ లెజిస్లేటివ్ ఎఫైర్స్ అండ్ జస్టిస్ జి.ప్రతిభాదేవి జారీ చేసిన నియామక ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అందజేశారని ఆచార్యులు బుధవారం విలేకరులకు తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రభుత్వం తరఫున స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తానని తెలిపారు.
నకిలీ పీఎఫ్ చలానాలపై విచారణకు ఆదేశం
అన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఇటీవల శానిటరీ కాంట్రాక్టర్ నకిలీ పీఎఫ్ చలానాలు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణకు దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ఆర్‌జేసీ వి.త్రినాథరావును విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఆగస్టు ఆరో తేదీన అన్నవరం దేవస్థానికి వచ్చి విచారణ చేయనున్నారు.
ఐదుగురి అరెస్ట్
సీతానగరం: మండలంలోని నల్గొండ శివారున గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేశామని నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. సీతానగరం పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ శివారున ఉన్న మామిడి తోటల్లో అదే గ్రామానికి చెందిన చింతల గంగరాజు, బండారు అప్పన్న దొర, తొర్రేడుకు చెందిన తాటిపాక గణేష్, మురముండకు చెందిన నేరుమిల్లి అఖిల్, బొబ్బిల్లంకకు చెందిన పోలీన సాయి సతీష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో సమక్షంలో ఐదు ప్యాకెట్లులో ఉన్న గంజాయి, మోటారు సైకిల్, రూ.1,500 సీజ్ చేశారు. ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి, ఇక్కడకు తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు.