
కటకటాల్లోకి కీచక కరస్పాండెంట్
రాయవరం: మాచవరంలో బాలిక (విద్యార్థిని)ను గర్భవతిని చేసిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ ఆకుమర్తి జయరాజును బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాయవరం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ పి.ప్రదీప్తి ఆ వివరాలు వెల్లడించారు. మాచవరంలో మార్గదర్శి ఇంగ్లిషు మీడియం పాఠశాలను ఆకుమర్తి జయరాజు కరస్పాండెంట్‌గా ఉంటూ నిర్వహిస్తున్నాడు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. ఈ ఏడాది మార్చి 26న ఆ బాలికను పాఠశాలలో తన ఆఫీసు రూమ్‌కు రప్పించుకుని అల్మరాలో ఉన్న ఫైల్స్ తీయాలని ఆదేశించాడు. బాలిక ఆ ఫైల్స్ తీస్తుండగా జయరాజు వెనుక నుంచి గట్టిగా పట్టుకోవడంతో బాలిక కేకలు వేసింది. దీంతో ఆమె నోరు నొక్కి, చంపేస్తానని బెదిరించి, అత్యాచారం చేశాడు. కాగా.. బాలిక శరీరంలో వస్తున్న మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా, ఐదు నెలల గర్భవతి అని తేలింది. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఈ నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జయరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని రామచంద్రపురం మండలం కొత్తూరు వద్ద అరెస్ట్ చేశారు. అలాగే నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్‌బాబులను ఆమె అభినందించారు. విలేకరుల సమావేశంలో మండపేట సీఐ పి.దొరరాజు, ఎస్సై డి.సురేష్‌బాబు పాల్గొన్నారు.
రామచంద్రపురం మండలం
కొత్తూరులో అరెస్టు
వివరాలు వెల్లడించిన ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి