
భార్యను చంపిన భర్త అరెస్టు
రాజానగరం: కట్టుకున్న భార్యను నాపరాయితో కొట్టి హతమార్చిన భర్తను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించామని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆ ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు శివారు సంతోష్ నగర్‌లో నివాసం ఉంటున్న నల్లమాటి లక్ష్మి పెద్ద కుమార్తె ఉషారాణికి నర్సీపట్నం సమీపంలోని గిడుతూరుకు చెందిన వేమగిరి మాణిక్యంతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం అనంతరం ఉపాధి కోసం అత్తింటికి వచ్చిన మాణిక్యం సంతోష్ నగర్‌లోనే వేరొక ఇంటిలో ఉంటూ వెల్డింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్యపై అనుమానం పెంచుకుని, తరచూ గొడవ పడేవాడు. నెల రోజుల క్రితం ఇదే విషయమై రాజానగరం పోలీసులకు ఉషారాణి ఫిర్యాదు చేసింది. అయినా అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈ నెల 26 రాత్రి 11.30 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మాణిక్యం తన భార్య తలపై నాపరాయితో కొట్టి పరారయ్యాడు. గమనించిన చుట్టుపక్కలవారు ఈ విషయాన్ని అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె తల్లి నల్లమాటి లక్ష్మికి సమాచారం ఇవ్వడంతో రక్తపు మడుగులో ఉన్న ఉషారాణిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 12.40 గంటలకు చనిపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాణిక్యాన్ని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కి పంపించారని డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.