
వాడపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో అన్న ప్రసాదం, లడ్డూ, పులిహోర తయారీ, ఆర్వో వాటర్ ప్లాంట్లను బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. అలాగే లడ్డూ, పులిహోర ప్రసాదాలను విక్రయిస్తున్నారు. వాటి నాణ్యతను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీఏబీ నందాజీ, జిల్లా ఫుడ్స్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ వై.రామయ్య పరిశీలించారు. తయారీతో పాటు అక్కడ ఉన్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం అనంతరం వారికి వేద ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు పాల్గొన్నారు.