
హజ్ కమిటీని రద్దు చేయాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ముస్లింల ధార్మిక పవిత్రతను మంటగలిపేలా, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీని నియమించిందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ ఆరోపించారు. ధర్మపండితుల స్థానంలో పార్టీ కార్యకర్తలను నియమించడం హజ్ యాత్ర పవిత్రతను, యాత్రికుల ప్రయోజనాలను కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ కమిటీలో ముగ్గురు ఇస్లామిక్ ధార్మిక పండితులను నియమించాల్సి ఉండగా టీడీపీ కార్యకర్తలైన పఠాన్ ఖాదర్ ఖాన్, షేక్ హాసన్ బాషాలను ముస్లిం థియాలాజిస్ట్‌లుగా పొందు పరుస్తూ అనర్హులను నియమించిందని ఆరోపించారు. నిజానికి వీరిద్దరూ ఎలాంటి ఇస్లామిక్ ధర్మశాస్త్రాన్నీ అధ్యయనం చేయలేదన్నారు. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు ఆరిఫ్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి ఏర్పాటు చేసిన హజ్ కమిటీని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మైనారిటీ మంత్రి, ప్రభుత్వ మైనారిటీ సలహాదారులవంటి వారున్నప్పటికీ పవిత్రమైన హజ్ కమిటీలో చట్ట ఉల్లంఘన జరుగుతూంటే నోరెత్తకుండా వ్యవహరించడం శోచనీయమన్నారు. వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘లులు’ భూముల
జీఓ రద్దు చేయాలి
నిడదవోలు: విశాఖలో 13.83 ఎకరాల ప్రభుత్వ భూములు, విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను బహుళ జాతి సంస్థ లులుకు కట్టబెడుతూ ఇచ్చిన జీఓ నంబర్ 137ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిడదవోలు ఆర్టీసీ డిపో ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జీఓ కాపీని దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేత రాంబాబు మాట్లాడుతూ, లులును ప్రోత్సహించడం వలన వేలాది మంది చిన్న వ్యాపారులు, లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని నాశనం చేయడం తగదని అన్నారు.
అన్నదాత సుఖీభవ
ఫిర్యాదులపై గ్రీవెన్స్ సెల్స్
రాజమహేంద్రవరం సిటీ: అన్నదాత సుఖీభవ ఫిర్యాదుల పరిష్కారానికి మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో గ్రీవెన్స్ సెల్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అన్నదాత సుఖీభవకు అనర్హులైన రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ గ్రీవెన్స్ సెల్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరస్కరణ కారణాలను రైతులకు వివరించి, సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లా స్థాయిలో 0883–2944455 నంబరుతో గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతి సాధించని ఎంపీడీఓలు, గృహ నిర్మాణ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గృహ నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల నుంచి అడ్వాన్స్ నిధులు తిరిగి తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కాలువల పూడికతీత పనుల పురోగతిపై క్షేత్రస్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. వర్షాకాలంలో ముంపు నివారణపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు ప్రతి శనివారం వసతి గృహాలను సందర్శించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, హౌసింగ్ పీడీ ఎస్.భాస్కర్‌రెడ్డి, సీపీఓ ఎల్.అప్పలకొండ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

హజ్ కమిటీని రద్దు చేయాలి

హజ్ కమిటీని రద్దు చేయాలి