
కూటమి ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిల్ వేస్తాం
రాజమహేంద్రవరం సిటీ: దొంగ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి, ఆ హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) వేయనున్నట్లు అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అనడం దారుణమైన విషయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పథకాన్ని అమలు చేసి చూపించారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని అమలు చేయకుండా క్యాబినెట్‌లో ప్రకటించడం దారుణమన్నారు. తల్లికి వందనం అమలు జరగడం లేదన్నారు. జగన్ రూ.13 వేలు ఇస్తే విమర్శించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా రూ.13 వేలే ఇస్తోందని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పి, కార్పొరేట్ కంపెనీలకు భూములను కారుచౌకగా 99 పైసలకే కట్టబెడుతున్నారని, ఇందులో క్విడ్ ప్రో కో జరుగుతోందని హర్షకుమార్ ఆరోపించారు. ఎవరికో ఒకరికి భూములు కట్టబెట్టడానికే మంత్రి మండలి సమావేశం జరుగుతోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రతి వారినీ జైలులో పెడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడం గురించి ఆలోచించకుండా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. బిహార్‌లో జరిగిన ఎన్నికల అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం లోక్‌సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. బిహార్ ఎన్నికల్లో 8 లక్షల బోగస్ ఓట్లు వచ్చాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ఎన్నికల్లోనూ బోగస్ ఓట్లు సృష్టించి గెలుస్తున్నారని ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే లెక్క పెట్టిన ఓట్లే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఈవీఎంలను మేనిప్యులేట్ చేసి, ఎన్నికై న ప్రధాని దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపి విజయం సాధించాలని హర్షకుమార్ సవాల్ చేశారు.