
దేవుడి పేరుతో ఇసుక దోపిడీ!
కొత్తపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. నిబంధనలను అతిక్రమించి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. చివరకు దేవుడి పేరును వాడుకుని మరీ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆత్రేయపురం అధికారిక ఇసుక ర్యాంపు సమీపంలో ప్రజల అవసరాల కోసం స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి ఇసుక నిల్వలు పెట్టారు. ఆ పాయింట్ నుంచి ఆదివారం రాత్రి అక్రమంగా ఇసుక రవాణాను ప్రారంభించారు. దీన్ని గమనించిన స్థానికులు సోమవారం రాత్రి మాటు వేసి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ఎందుకు ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు నిలదీస్తే, వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో అభివృద్ధి పనులకు తీసుకువెళుతున్నామని అక్రమార్కులు సమాధానం చెప్పారు. ఆలయానికి అయితే అర్థరాత్రి దొంగతనంగా తరలించడమేమిటి, పగటి పూటే తోలుకోవచ్చు కదా అని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మాటామాటా పెరిగి వివాదం తలెత్తింది. ఈ లోపు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించాలని గ్రామస్తులు పట్టుపట్టగా, అది రెవెన్యూ అధికారుల పని అని చెప్పి, వాహనాలను అక్కడి నుంచి పంపించేశారని పలువురు స్థానికులు తెలిపారు. దీనిపై ఎస్సై రామును ‘సాక్షి’ వివరణ కోరగా అక్కడ గొడవపడుతున్నారనే సమాచారంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపిచేశామని తెలిపారు. వాహనాలేమీ సీజ్ చేయలేదని స్పష్టం చేశారు.
మండల స్థాయి నాయకుడి ఆగడాలు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మండలంలో టీడీపీ నాయకులు ముఖ్యంగా ఒక మండల స్థాయి నాయకుడి ఆగడాలు, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఆ నాయకుడి అక్రమ వ్యవహారాల్లో భాగంగానే గత నెల 16, 17 తేదీల్లో ఆత్రేయపురం చినపేట సమీపం నుంచి లంక భూముల్లోకి అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేసి మట్టి తరలించే ప్రయత్నాలు చేయగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడం, వారు స్పందించకపోవడంతో గ్రామస్తులే అడ్డుకున్నారు. అప్పట్లో వారి ప్రయత్నాలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.
కూటమి నాయకుల అక్రమ దందా
అడ్డుకున్న గ్రామస్తులు