
బంగారం వ్యాపారిపై దొంగల దాడి
పిఠాపురం: బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే వ్యాపారిపై దొంగలు దాడి చేసి, అతడి వద్ద ఉన్న వస్తువులను దోపిడీ చేశారు. చెందుర్తిలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని నల్లమందు సందుకు చెందిన సమీర్ ప్రజాపత్ భవాని అనే వ్యక్తి సిల్వర్ ప్యాలెస్ అనే వెండి, బంగారు నగల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ ఇతర ప్రాంతాల్లోని వెండి, బంగారు వ్యాపారుల నుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం వస్తువులు తయారు చేయడం, వాటిని తీసుకెళ్లి వారికి ఇవ్వడం, మళ్లీ వారి నుంచి ఆర్డర్లు తీసుకోవడం, వారిచ్చే నగదుతో పాటు వెండి, బంగారం రావడం ఆయన పని. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు యజమాని చెప్పిన ఆర్డర్ల ప్రకారం వెండి వస్తువులను తీసుకుని పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలులోని షాపుల్లో ఇచ్చాడు. అక్కడి నుంచి ముడి వెండిని, వెండి వస్తువులను, బంగారాన్ని తీసుకుని గొల్లప్రోలులో పని ముగించుకుని చెందుర్తిలోని మరో బంగారు షాపు వద్దకు బయలుదేరాడు. మార్గం మధ్యలో జాతీయ రహదారి 216 నుంచి చెందుర్తి వెళ్లే రోడ్డులో పామాయిల్ తోట వద్దకు వచ్చే సరికి, రెండు మోటారు సైకిళ్ల మీద నలుగురు వ్యక్తులు వచ్చి అతడిని అడ్డుకున్నారు. భయభ్రాంతులకు గురిచేసి అతడి వద్ద ఉన్న 12.50 కేజీల వెండి, 51 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని విషయం తెలిపాడు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ, తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు.
ఆభరణాలు, నగదు లాక్కుని పరారీ
చెందుర్తిలో కలకలం రేపిన ఘటన