
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) టి.సీతారామమూర్తి జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్‌ఆర్ ప్రేమ్‌కుమార్, సీపీఓ ఎల్.అప్పలకొండ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ, ఫిర్యాదుల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. మళ్లీ మళ్లీ వస్తున్న అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. రెవెన్యూ 71, పోలీస్ 34, పంచాయతీరాజ్ 28, ఇతర శాఖలవి 58 చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు
31 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టం(పీజీఆర్‌ఎస్)కు 31 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ అర్జీదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీల్‌చైర్‌లో వచ్చిన దివ్యాంగ మహిళ వద్దకు నేరుగా ఆమె వెళ్లి అర్జీ స్వీకరించారు. ఆమె సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా చట్ట పరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా పోలీసు స్టేషన్ల అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఎస్‌జీఎఫ్ సెక్రటరీ నియామ
కానికి దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) జిల్లా సెక్రటరీగా రెండేళ్లు పని చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న అర్హులైన వ్యాయామోపాధ్యాయులు (పీడీ) తమ నామినేషన్లను తన కార్యాలయానికి ఆగస్టు 4వ తేదీ 12 గంటల్లోగా అందజేయాలని సూచించారు. గతంలో ఒకసారి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీలుగా పని చేసిన వారు అనర్హులని తెలిపారు.
ఇంటర్ సంస్కరణలపై శిక్షణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ విద్యా సంస్కరణలపై జిల్లాలోని ప్రిన్సిపాళ్లకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి (ఆర్‌ఐఓ) ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం మాట్లాడుతూ, కొత్త సంస్కరణల ప్రకారం సిలబస్ అప్‌డేట్, సౌకర్యవంతమైన సబ్జెక్టులను కలపడం తదితర మార్పులు చేశారని వివరించారు. విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని తగ్గించి, నీట్, జేఈఈ వంటి ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సన్నద్ధ చేయడమే ఈ సంస్కరణల ఉద్దేశమన్నారు.
కడలిలోకి 5.85 లక్షల క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి 5,85,246 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులుగా ఉంది. తూర్పు డెల్టాకు 3,700, మధ్య డెల్టాకు 2,400, పశ్చిమ డెల్టాకు 6 వేలు కలిపి 12,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భద్రాచలంలో నీటిమట్టం 36.10 అడుగులకు చేరింది.

అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి

అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి