
మొరాయించిన ప్రైవేటు ట్రావెల్ బస్సు
గండేపల్లి: జాతీయ రహదారిపై సోమవారం ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు ప్రయాణికులతో కావేరి ట్రావెల్ బస్సు బయలుదేరింది. మండలంలోని మల్లేపల్లి శివారు హోటల్ వద్ద భోజనాలు చేసేందుకు బస్సును డ్రైవర్ నిలిపాడు. భోజనాలు అనంతరం బస్సును స్టార్ట్ చేయగా మొరాయించింది. స్థానికంగా ఉన్న మెకానిక్ మరమతులు చేసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యలను బస్సు యాజమాన్యానికి వివరించినా సరిగా స్పందించలేదని ప్రయాణికులు తెలిపారు. మరో బస్సులో గమ్యానికి పంపించాలని కోరామని, కనీసం టికెట్ సొమ్ములైన ఇస్తే మరో బస్సులో వెళతామని చెప్పినప్పటికి పట్టించుకోలేదన్నారు. దీనిపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గండేపల్లి పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు. దీంతో యాజమాన్యం స్పందించి ప్రయాణికులకు భోజన సదుపాయం, ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు పోలీసులు తెలిపారు.
తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు
పట్టించుకోని యాజమాన్యం