
వైఎస్సార్ సీపీ నేత షర్మిలా రెడ్డి ఇంట్లో అగ్నిప్రమాదం
రూ.10 లక్షల వరకు నష్టం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైఎస్సార్ సీపీ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి ఇంటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సోమవారం ఆ వివరాలను తెలిపారు. షర్మిలారెడ్డి, ఆమె భర్త అనిల్‌రెడ్డితో కలిసి కొద్దిరోజుల క్రితం లండన్‌లో ఉంటున్న వారి కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే ఇంటిలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఇంటిలోని ఫర్నిచర్‌కు మంటలు అంటుకుని ఇల్లంతా పొగ కమ్మేసింది. ఇల్లు లాక్ చేసి ఉండడంతో ఆ పొగలు భవనం పైకి వచ్చాయి. దీన్ని చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచారు. వారు వచ్చి తలుపులను పగులకొట్టి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఇంటిలో సుమారు రూ.10లక్షల విలువైన ఫర్నిఛర్ ధ్వంసమైంది. అగ్నిప్రమాదం వార్త తెలిసిన వెంటనే వచ్చి సహాయం అందించిన ఫైర్ సిబ్బంది, తన అభిమానులకు షర్మిలారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.