
తాడిని తలదన్నే రుచి!
సామర్లకోట: ప్రస్తుత సీజన్‌లో దొరికేది తాటి పండు. ఈ తాటిపండులో అనేక పోషకాలు ఉంటాయి. ముంజెలు, పండ్లు, తేగలు అందిస్తూ అనేక విధాలుగా మనకు తాటి చెట్లు ఉపయోగపడుతున్నాయి. పూర్వం తాటిచెట్టు, ఆకులతో ఇళ్ల నిర్మాణం జరిగేది. క్రమేపీ పెంకుటిళ్లు, ప్రస్తుతం డాబాలు వచ్చాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన పండ్లను తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. తాటి పండుతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. వాటి రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. తాటిచెట్టుకు కాసిన ముంజెకాయలు ముదిరిపోవడంతో తాటి పండ్లుగా మారుతాయి. ఆ పండ్ల గుంజుతో బూరెలతో పాటు అనేక రకాల పిండి వంటలు తయారు చేస్తారు.
రసాయనాలు లేని ఏకై క పండు
గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు 20 ఏళ్ల క్రితం వరకు ప్రస్తుత సీజన్‌లో తాటిపండ్లతోనే కడుపు నింపుకునే వారు. చెట్టు నుంచి పడిన పండును నేరుగా కొందరు, నిప్పులపై కాల్చుకొని మరి కొందరు ఈ పండ్లను తొక్కలు తీసి నేరుగా తినేవారు. అయితే ప్రస్తుతం ఈ పండ్లను దూరం పెడుతున్నారు. తాటిపండులో అనేక పోషకాలు ఉన్నాయి. ఎటువంటి పురుగు మందులు, రసాయనాలు వాడని తాటి పండ్లు వినియోగం ఆరోగ్యదాయకం. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వంటకాలకు డిమాండ్ పెరిగింది. దాంతో పండ్లను రోడ్డు మార్జిన్‌లో విక్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. తాటిపండులో విటమిన్ ఎ,సీలు ఉంటాయి. బి కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తుంది. ఎక్కువగా పీచు పదార్థాలు ఉండటం వలన జీర్ణకోశ వ్యాధులు, మలబద్ధకం దూరం అవుతుంది. రక్త శుద్ధికి, మెదడుకు గ్లూకోజ్ అందించడంలో ఈ పండు దోహదపడుతుంది. నేటి తరం వారికి ఈ తాటిపండు విలువ తెలియడం లేదు. దీనికితోడు తాటి చెట్లను నరికి వేయడంతో ఇవి రానురాను కనుమరుగైపోతున్నాయి.
అనేక వంటకాలు
తాటి పండ్లతో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. వీటితో చేసే బూరెలు, గారెలు, రొట్టెలు, అప్పాలు ఎంతో రుచిగా ఉంటాయి. తాటికాయ గుంజు తీసి దానిలో వరి నూక, బెల్లం కలిపి బూరెలు, గారెలు, రొట్టెలు తయారు చేస్తారు. కొన్ని మిఠాయి దుకాణాల్లో ఆంధ్రా పిండి వంటకాల పేరుతో తాటి బూరెల విక్రయాలు సాగుతున్నాయి. వీటి ధర కూడా అధికంగానే ఉంటుంది.
తాటి పండ్లతో అనేక ప్రయోజనాలు
వాటితో చేసే వంటకాలు అద్భుతం
నోరూరించేలా గారెలు, బూరెలు
అధిక శ్రమతో కూడిన పని
తాటి పండ్లతో పిండి వంటలు చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. శుభకార్యాలలో వేసే బూరెలను సులభంగా తయారు చేయవచ్చు. తాటి పండ్లతో బూరెలు చేయడానికి కనీసం ఇద్దరు ఉండాలి. తాటి పండ్లను నిప్పులపై మగ్గ బెట్టాలి. వాటి తొక్క తీసి గుంజును పీచు లేకుండా తీయాలి. పండ్ల తీపిని బట్టి తగిన మోతాదులో బెల్లం కలపాలి. అప్పటికే నీటిలో నానబెట్టిన నూకను తాటిపండ్ల గుంజులో బాగా కలపాలి. సుమారు 30 నిమిషాలు ఉంచిన తరువాత నూనెలో కావలసిన పరిమాణంలో తాటి బూరెలు, అప్పాలు, గారెలు తయారు చేసుకోవచ్చు. వీటిని ఒకసారి రుచి చూస్తూ వదలిపెట్టే ప్రసక్తి ఉండదు!
– మచ్చా బిందు, వీకే రాయపురం, సామర్లకోట మండలం
అనేక పోషకాలు
తాటిచెట్ల నుంచి వచ్చే పండ్లలో మంచి పోషకాలు ఉంటాయి. తాటిపండులో విటమిన్లు ఏ,బీ,సీ.. జింక్, పోటాషియం, ఐరన్, క్యాల్షియం వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. తాటిపండులో పోషకాలు క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచటంలో తాటిపండు దోహదపడుతుంది. తాటిపండు వికారం తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. తాటి పండ్లతో పిండి వంటలు తయారు చేసేవారు కనిపిం చడం లేదు. ఆ పిండి వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. చిన్నతనంలో స్నేహితులతో కలిసి తినే వారం.
– పసల సత్యానందరావు, డాక్టర్, సామర్లకోట

తాడిని తలదన్నే రుచి!

తాడిని తలదన్నే రుచి!

తాడిని తలదన్నే రుచి!

తాడిని తలదన్నే రుచి!

తాడిని తలదన్నే రుచి!