
జాబ్‌చార్టుపై అవగాహన అవసరం
ఎంపీడీఓల శిక్షణలో రాష్ట్ర అదనపు కార్యదర్శి వెంకటకృష్ణ
సామర్లకోట: ఎంపీడీఓలు తమ జాబ్‌చార్టుపై అవగాహన పెంచుకోవాలని, ఇదే తరుణంలో గ్రామ పంచాయతీల సొంత వనరుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర అదనపు కార్యదర్శి కె.వెంకటకృష్ణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు నిర్వహించే శిక్షణకు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పదోన్నతి పొందిన 46 మందికి మొదటి బ్యాచ్‌లో శిక్షణను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు సొంత వనరులు సమీకరణ, ఆర్థిక సుస్థిరత ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సహాయం ఆయా గ్రామ పంచాయతీలకు సరిపోదన్నారు. గ్రామ పంచాయతీలు సమగ్రాభివృద్దికి, సంక్షేమానికి వివిధ కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సామాజిక న్యాయంతో కూడిన ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు, బహుముఖ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలులో మండల పరిషత్తు పాలక మండలి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎంపీపీల నిర్ణయాలనే పాటించవలసిన పనిలేదన్నారు.
విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు మాట్లాడుతూ ఎంపీడీఓ విధి నిర్వహణలో మండల ప్రజా పరిషత్తుకు, ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. డ్వామా ఏపీడీ భానుప్రకాష్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఎంపీడీవో డి.శ్రీలలిత, ఫ్యాకల్టీలు శర్మ, డి.శ్రీనివాసరావు, కె సుశీల మొదటి రోజు శిక్షణ నిర్వహించారు.