
జనసేన నేతలపై చార్జిషీట్ వేయాలి
ఎస్పీకి ఫీల్డు అసిస్టెంట్ ఫిర్యాదు
కరప: జనసేన పార్టీ నాయకులు తనను కులంపేరుతో దూషించడమే కాకుండా వేధింపులకు గురిచేశారని, వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకు చార్జిషీట్ ఫైల్ చేయలేదని ఫీల్డు అసిస్టెంట్ పులపకూర సునీత సోమవారం ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. తన చావుతో న్యాయం జరుగుతుందని పోలీసులు భావిస్తే దానికై నా సిద్ధంగా ఉన్నానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు సునీత జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌కు చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి... కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన పులపకూర వీరబాబు భార్య సునీత ఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు బండారు మురళి ఫీల్డు అసిస్టెంట్ సునీతను కులంపేరుతో దూషించడమే కాకుండా, కోరిక తీర్చాలని లేదా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. ఆ వేధింపులు తాళ లేక గతేడాది అక్టోబర్ నెల 22వ తేదీన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేధింపులకు గురిచేసిన జనసేన నాయకులు బండారు మురళి, ఘంటా నానిబాబు, గుబ్బల భవానీలపై అదే నెల 28వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఐదునెలలు అవుతున్నా చార్జిషీట్ ఫైల్ చేయకపోవడంపై ఈ ఏడాది మార్చి 10న, ఏప్రిల్ 7న కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 21న కరప పోలీసులు తన వద్దకు వచ్చి బండారు మురళి, మరో ఇద్దరిపై పెట్టిన కేసు కొట్టివేశారు.. కాగితాలపై సంతకం చేయమని అడిగారని, సంతకం చేయనని చెప్పడంతో పోలీసులు వెళ్లిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వేధింపులకు గురి చేసినవారిపై చార్జిషీట్ వేసి, వారిని అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్టు సునీత తెలిపారు. తన చావుతో న్యాయం జరుగుతుందని పోలీసులు భావిస్తే అందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె తెలిపారు.