
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
ధవళేశ్వరం: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మత్స్యకారుడు మృతి చెందాడు. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక జలారుపేటకు చెందిన సావదాల సత్యారావు (43) సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో గోదావరిలో చేపలు పట్టేందుకు కాటన్ బ్యారేజీ వద్దకు వెళ్లాడు. బ్యారేజ్ స్కవర్ స్లూయిజ్ వద్ద ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారులో శిశువు జననం
ప్రత్తిపాడు రూరల్: కారులో పండంటి పాపకు ఓ మహిళ సోమవారం జన్మనిచ్చింది. మండలంలోని రాచపల్లికి చెందిన మడికి సారికకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ గీత సెలవులో ఉండడంతో సిబ్బంది వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీసుకువెళ్లాని సిబ్బంది సూచించారు. దీంతో గర్భిణి భర్త మడికి చిన్నిబాబు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీనుకు విషయం తెలిపారు. దీంతో వైస్ ఎంపీపీ శ్రీను తన కారు రాచపల్లి పీహెచ్‌సీకి పంపి గర్భిణిని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. రాచపల్లి దాటిన వెంటనే పోలవరం కాలువ వద్ద పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో కారులో ఉన్న ఆశా వర్కర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పురుడు పోసింది. తిరిగి రాచపల్లి పీహెచ్‌సీకి తల్లీబిడ్డను తరలించి వైద్య సేవలు అందించారు.

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి