
కూటమి పాలనలో దళితులపై వివక్ష
వైఎస్సార్ సీపీ పాలనలో
దళితులకు పెద్దపీట
వైఎస్ జగన్ నేతృత్వంలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని సుధాకర్‌బాబు గుర్తు చేశారు. దళితుల సంక్షేమ పథకాలకు రూ.2.75 లక్షల కోట్లు అందించారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల్లో ఉన్న పేదల కోసం తానున్నానని భరోసా ఇచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. ‘నీకోసం, నాకోసం, ఊరు, వాడ కోసం, దగాపడ్ట అక్కచెల్లెమ్మల కోసం, సమాజం, అణగారిన వర్గాల కోసం వైఎస్ జగన్‌ను తిరిగి సీఎంను చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. జగన్‌ను గద్దె దింపడం కోసం ఈవీఎంలే పని చేశాయో.. ఢిల్లీ పెద్దలే పని చేశారో.. కుతంత్ర రాజకీయాలే పని చేశాయో తెలియదు. కానీ, ఈ సమయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు దళితులందరూ నడుం బిగించి ముందుకు సాగాలి’ అని పిలుపునిచ్చారు. దళిత వర్గాల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువుకోవాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా, అంబేడ్కర్ ఆశయాలు కొనసాగాలన్నా జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని, అందుకు దళితులందరూ కలసికట్టుగా కృషి చేసి, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్సార్ సీపీని గెలిపించాలని అన్నారు. అన్న పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చి, అన్ననే వంచించాడని పవన్‌కు పరోక్షంగా చురకలు వేశారు.
సాక్షి, రాజమహేంద్రవరం/సీటీఆర్‌ఐ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దళితులపై వివక్ష పెరిగిందని, దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. రాజమహేంద్రవరం సంహిత డిగ్రీ కళాశాల ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన జిల్లా దళిత నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై వివక్ష పేట్రేగిపోతోందన్నారు. దళిత జాతి తలెత్తుకుని జీవించాలన్నా, సంక్షేమ పథకాలు మళ్లీ అందాలన్నా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి సీఎంగా రావాలని అన్నారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అలుపెరగని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూంటే వేధింపులకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా బరితెగించి వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు, అరాచకాలను ఎదుర్కొనేందుకు దళిత జాతి అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
‘మన దగ్గర డబ్బు లేకపోవచ్చు. కార్లు, బంగ్లాలు లేకపోవచ్చు. కానీ, గుండెల నిండా సత్తా ఉంది’ అని అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్ జగన్ వెంటే నడుస్తామని చెప్పారు. నమ్మిన వారి కోసం ప్రాణాలర్పించే సత్తా దళితులకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత గ్రామాల్లో చిట్టచివరి గ్రామం వరకూ కూటమి ప్రభుత్వ అరాచకాలను తీసుకెళ్లేందుకు దళితులందరూ సంసిద్ధంగా ఉండాలని సుధాకర్‌బాబు సూచించారు.
కూటమి కుట్రలపై ‘దళిత ఫోర్స్’
కూటమి ప్రభుత్వం దళితులు, ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా దళిత ఫోర్స్‌ను నియమించనున్నట్లు సుధాకర్‌బాబు వెల్లడించారు. దీనికోసం 82,987 మందిని ఎంపిక చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 17 నగరాలున్నాయని, ఒక్కో నగరంలో 30 మంది చొప్పున 510 మందిని నియమిస్తామని చెప్పారు. అలాగే, 660 మండలాలకు గాను ఒక్కో మండలానికి 18 మంది చొప్పున 11,888 మందిని 104 పట్టణాలకు గాను ఒక్కోచోట 18 మంది చొప్పున 18,072 మందిని, 13,500 గ్రామాల్లో ఒక్కో గ్రామానికి ఐదుగురు చొప్పున 67,500 మందిని దళిత ఫోర్స్‌లో భాగస్వాముల్ని చేస్తామని వివరించారు. మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అమ్మ ఒడి అనగానే జగనన్న గుర్తుకొస్తే.. ఆరోగ్యశ్రీ అంటే గుర్తుకొచ్చేది వైఎస్సార్ అని అన్నారు. ఎన్నో పథకాల సృష్టికర్త జగన్ అని చెప్పారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, జగన్ నాయకత్వం మరింత బలపడేందుకు ప్రధాన కారణం దళితులేనని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కీలకమైన దళిత వర్గాలు ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని, వైఎస్ జగన్‌ను సీఎంను చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఇన్‌చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, చంద్రబాబు దళిత ద్రోహి అని, అబద్ధాల్లో ఘనుడని ఆరోపించారు. వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచిన నేత వైఎస్ జగన్ అని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మంత్రి, నామినేటెడ్ పదవుల్లో దళితులకు పెద్దపీట వేసిందన్నారు. అనంతరం దళిత ప్రజాప్రతినిధులు, నేతలను సుధాకర్‌బాబు ఘనంగా సన్మానించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు తదితరులు పాల్గొన్నారు.
దళిత మహిళలపై అత్యాచారాలు
అటకెక్కిన సంక్షేమం
వైఎస్ జగన్‌తోనే
అంబేడ్కర్ ఆశయ సాధన
ఆయనను తిరిగి ముఖ్యమంత్రి
చేయడమే లక్ష్యంగా సాగుదాం
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు పిలుపు
రాజమహేంద్రవరంలో దళితుల
ఆత్మీయ సమావేశం

కూటమి పాలనలో దళితులపై వివక్ష

కూటమి పాలనలో దళితులపై వివక్ష