
ధర ఢమాల్
మంచి మార్కెట్ కొనసాగుతోంది
ప్రస్తుతం మంచి మార్కెట్ కొనసాగుతోంది. కిలో సగటు ధర రూ.287 లభిస్తోంది. కంపెనీలు సిండికేట్ కావడంతో మార్కెట్ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. దీంతో, మార్కెట్లో ధర పెరిగి, తగ్గింది. సగటు ధర కిలో రూ.300 ఉంటే గిట్టుబాటు అవుతంది. కిలోకు రూ.22 వరకూ తగ్గింది. నాణ్యతను బట్టి ధర పలుకుతుంది. మంచి గ్రేడులకు ధర బాగుంది. ముందు ముందు మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేం. కౌలు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ ధరకు భూముల కౌలు, బ్యారన్లు తీసుకుంటే నష్టపోతారు.
– కరుటూరి శ్రీనివాస్, అధ్యక్షుడు,
పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం, దేవరపల్లి
నిబంధనలు కఠినతరం
పొగాకు బోర్డు నిబంధనలు కఠినంగా ఉంటాయి. 2025–26 పంట కాలానికి సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించారు. బ్యారన్‌కు 3,512 కిలోల చొప్పున ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో 49.70 మిలియన్ల ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఉంది. దీనికి మించి పంట ఉత్పత్తి చేస్తే రైతులు నష్టపోతారు. పంట నియంత్రణ రైతుల చేతుల్లోనే ఉంటుంది. 2024–25 పంట కాలంలో 58.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, వచ్చే పంట కాలానికి సుమారు 9 మిలియన్ల కిలోలు తగ్గించారు. పంట సాగుకు, నర్సరీల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. మార్కెట్ హెచ్చుతగ్గుల్లో నడుస్తోంది.
– జీఓల్‌కే ప్రసాద్, రీజినల్ మేనేజర్,
పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం
● పడిపోయిన వర్జీనియా పొగాకు రేటు
● కిలోకు రూ.20 తగ్గుదల
● రెండు వారాలుగా
కిలో గరిష్ట ధర రూ.390
● నేడు రూ.370
● దిగులు చెందుతున్న రైతులు
దేవరపల్లి: ఊహించని విధంగా వర్జీనియా పొగాకు ధర పడిపోయింది. మార్కెట్లో దాదాపు రెండు వారాలుగా కిలో గరిష్ట ధర రూ.390 పలుకుతూండగా.. శనివారం అది ఏకంగా రూ.20 తగ్గి రూ.370కి పడిపోయింది. దీంతో, రైతులు దిగులు చెందుతున్నారు. ఈ నెల 9న రూ.290 ధర పలకగా 10న రూ.336, 11న రూ.348, 16న ఏకంగా రూ.392కు పెరిగింది. ఒకే రోజు కిలోకు రూ.44 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్కెట్లో ఇదే గరిష్ట ధర. ఈ ధర ఈ నెల 17న రూ.390కి తగ్గి, శుక్రవారం వరకూ దాదాపు పది రోజుల పాటు అదే స్థాయిలో కొనసాగింది. దీంతో, తమ పంట పండిందనే రైతులు భావించారు. ఈ ధర ఇలాగే పెరుగుతూ రూ.400కు చేరుతుందని ఆశ పడ్డారు. పెట్టుబడులు, కౌలు డబ్బులు చేతికి వచ్చి, అప్పులు తీరడంతో పాటు కాస్త మిగులుతాయని ఆనందపడ్డారు. అయితే, వారి ఆశలపై నీళ్లు జల్లేలా ఒక్క రోజులోనే ధర కిలోకు రూ.20 తగ్గిపోయింది. దీంతో, ముందుముందు మార్కెట్ ఎలా ఉంటుందోనని రైతులు కలవరపడుతున్నారు.
రూ.1,077 కోట్ల పొగాకు విక్రయాలు
పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.1,077 కోట్ల విలువైన 37.53 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. ఉత్తర తేలిక నేలల్లో (ఎన్‌ఎల్‌ఎస్) పండిచే పొగాకు 35.87 మిలియన్ల కిలోలు, బ్లాక్ సాయిల్ (బీఎస్) పొగాకు 1.65 మిలియన్ల కిలోల మేర విక్రయాలు జరిగాయి. ఐదు వేలం కేంద్రాల్లో కిలో సగటు ధర ఎన్‌ఎల్‌ఎస్ పొగాకుకు రూ.289.19, బీఎస్ పొగాకుకు రూ.239.96 మేర లభించింది. ఎన్‌ఎఎల్‌ఎస్ పొగాకు ధర కిలోకు గరిష్టంగా రూ.370, కనిష్టంగా రూ.190 చొప్పున రైతులకు లభించింది. దాదాపు 45 మిలియన్ల కిలోల పొగాకు రైతుల వద్ద అమ్మకానికి ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్స్ గ్రేడ్, మిడిల్ గ్రేడ్ పొగాకు కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని రైతులు చెప్పారు. లీఫ్ గ్రేడ్ బేళ్లను నిల్వ చేసి ఉంచారు. దీనికి చివరిలో మంచి మార్కెట్ ఉంటుందని వారు భావిస్తున్నారు. లో గ్రేడ్ పొగాకు విక్రయాలు జరగాల్సి ఉంది.
అదనపు కోటా కోసం నిరీక్షణ
పొగాకు బోర్డు నిర్దేశించిన విధంగా బ్యారన్‌కు 45 క్వింటాళ్ల పొగాకు విక్రయాలు పూర్తయిన రైతులు అదనంగాా పండించిన పొగాకును మార్కెట్లో అమ్ముకోవడానికి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఏటా వేలం ముగింపు సమయంలో అదనంగా పండిన పొగాకును అమ్ముకోవడానికి బోర్డు అనుమతిస్తుంది. దీనికి కిలోకు రూ.5 శాతం అపరాధ రుసుంతో పాటు 2 శాతం కమీషన్‌ను రైతుల నుంచి వసూలు చేస్తోంది. గత ఏడాది రైతు సంఘాల విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో అదనంగా పండించిన పొగాకు అమ్మకాలపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అపరాధ రుసుం రద్దు చేసింది. దీని ద్వారా రైతులకు సుమారు రూ.184 కోట్ల లాభం చేకూరింది. అయితే 2025–26 పంట కాలంలో అదనంగా పండించిన పొగాకుకు పెనాల్టీ తప్పదని అప్పట్లోనే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరింది. మార్కెట్లో ధర బాగున్నందున ఈ సమయంలో అదనపు పంట అమ్ముకోవడానికి అనుమతిస్తే తమకు లాభసాటిగా ఉంటుందని రైతులు అంటున్నారు.
పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో వేలం కేంద్రాల వారీగా పొగాకు విక్రయాలు (మిలియన్ కిలోలు)
దేవరపల్లి 6.29
జంగారెడ్డిగూడెం–1 8.43
జంగారెడ్డిగూడెం–2 8.04
కొయ్యలగూడెం 7.53
గోపాలపురం 7.21

ధర ఢమాల్

ధర ఢమాల్

ధర ఢమాల్

ధర ఢమాల్