
వరద గోదారి
● సముద్రంలోకి 6 లక్షల క్యూసెక్కులు
● ఎగువన తగ్గుతున్న ఉధృతి
ధవళేశ్వరం: గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీంతో, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 6,01,884 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతూండటంతో మిగులు జలాల విడుదలను పెంచారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద కూడా సోమవారం నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 34.60 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులుగా నమోదైంది.
మరిడమ్మ సన్నిధిలో
భక్తుల సందడి
పెద్దాపురం: మరిడమ్మ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి, క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. కొత్తపేట, పాశిలి వీధి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
లోవకు కొనసాగుతున్న
భక్తుల రద్దీ
తుని రూరల్: ఆషాఢ మాసోత్సవాలు ముగిసి, శ్రావణ మాసం ప్రారంభమైనప్పటికీ లోవ దేవస్థానానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో 30 వేల మంది భక్తులు తరలి వచ్చి, తలుపులమ్మ అమ్మవారిని క్యూ లైన్ల ద్వారా దర్శించుకున్నారని ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మె త్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,48,265, పూజా టికెట్లకు రూ.2,62,031, తలనీలాలకు రూ.19,150, వాహన పూజలకు రూ.7,550, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.87,576, విరాళాలు రూ.66,375 కలిపి మొత్తం రూ.6,90,947 ఆదాయం లభించిందని వివరించా రు. తలుపులమ్మ అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన నగదును సోమవారం లెక్కిస్తామని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ, బ్యాంకు అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరచి, నగ దు లెక్కిస్తామన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొంటారన్నారు.

వరద గోదారి