
కోటసత్తెమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.2,01,266 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. కోటసత్తెమ్మ వారి నిత్యాన్నదాన ట్రస్టుకు నిడదవోలుకు చెందిన అయితం కనకయ్య, లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు సత్యనారాయణ, గంగాధర్, శివయ్య కుటుంబ సభ్యులు ఆదివారం రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ప్రధానార్చకుడు అప్పారావుశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఎయిడెడ్ ఉపాధ్యాయ
పరీక్ష ప్రశాంతం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎయిడెడ్ ఉపాధ్యాయ పరీక్ష రాజమహేంద్రవరం, కాకినాడలోని అయాన్ డిజిటల్ సెంటర్లలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులోని ఎస్తేర్ ఆగ్జిన్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఎయిడెడ్ పోస్ట్‌లకు విద్యా శాఖ ఈ పరీక్షలు నిర్వహించింది. దీనికి మొత్తం 1,249 మంది అభ్యర్థులకు హాజరు కావాల్సి ఉండగా 426 మంది పరీక్షలు రాశారు. కాకినాడలోని అచ్యుతాపురం సెంటర్‌లో 181 మంది, రాజమహేంద్రవరం లూథరిగిరి సెంటర్‌లో 245 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ వాసుదేవరావు తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరంలోని పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
గురుకులంలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
అనపర్తి: మండలంలోని లక్ష్మీనరసాపురంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలో 5 నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం వరకూ ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా ఎస్టీ విద్యార్థులకు 6, 7, 8, 9 తరగతుల్లో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 28న నేరుగా పాఠశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు.