
మూగజీవాలకూ హక్కులున్నాయ్..
ఫ పశువులు, వన్యప్రాణులను
చంపడం నేరం
ఫ జంతు రవాణాలో జాగ్రత్తలు అవసరం
రాయవరం: శారీరకంగా ఎక్కువగా బాధిస్తే, గొడ్డును బాదినట్లు బాదారు అంటారు. పశువుకన్నా హీనంగా ప్రవర్తించాడంటారు. అంటే పశువులను ఇష్టం వచ్చినట్లు దండించవచ్చని, అవమానించవచ్చని చాలా మంది ఉద్దేశం. వాటికి నోరు లేదు కాబట్టి ఎవరికీ తమ బాధ చెప్పుకోలేవు. అలాంటి మూగజీవాల రక్షణకు చట్టాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియని విషయం. అయితే మనుషులకే కాదు జంతువులకూ హక్కులుంటాయని మాచవరం పశు వైద్యురాలు ఎం.బిందు వివరించారు. అకారణంగా జంతువులను హింసిస్తే జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జంతువుల రవాణా, పెంపకంలోనూ వాటికి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో మూగజీవాలు, పశువులను విచక్షణా రహితంగా వాహనాల్లో తరలిస్తున్నారు. పదుల సంఖ్యలో పశువులను చిన్న చిన్న వాహనాల్లో కుక్కి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మూగజీవాల రక్షణ కోసం ప్రభుత్వం పలు చట్టాలు చేసింది. వాటిని అమలు పరిచేందుకు వివిధ విభాగాల అధికారులతో కమిటీలు వేసింది. అయినప్పటికీ పశువుల హక్కుల ఊసెక్కడా కన్పించడం లేదు. జంతువులను క్రూరంగా హింసిస్తూ ఆటోలు, లారీల్లో రవాణా చేస్తుంటారు. పశువుల మార్కెట్ నుంచి పశు సంపదను ఒకచోట నుంచి మరోచోటకు తరలించే క్రమంలో తీవ్ర హింసకు గురిచేస్తున్నారు. అలాగే పంట చేను మేసిందనే కోపంతో కొందరు పశువులను ఇష్టం వచ్చినట్లు బాదినా, నోరులేని పశువులు ఆ దెబ్బలను మౌనంగా భరిస్తూ ఉంటాయి. మానవ మనుగడకు సహాయపడుతూ జీవించే జంతుజాలం కోసం చట్టం ఏం చెబుతుందంటే..
చట్టం... జరిమానాలు
ఫ జంతువులపై క్రూరత్వ నివారణ/ నిరోధక చట్టం 1960లో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం వాహనాల్లో ఓవర్ లోడింగ్, తీవ్రంగా కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడం, నొప్పిని కలిగించే చర్యలను క్రూరత్వంగా పరిగణిస్తారు.
ఫ పది రూపాయలకు పైన విలువ చేసే ఏ జీవినైనా హింసిస్తే భారత శిక్షాస్మృతి కింద నేరమవుతుంది.
ఫ చిన్న వయసులో ఉన్న పశువులను, వ్యాధి బారిన పడిన వాటిని గానీ ఎలాంటి పనులకూ ఉపయోగించరాదు.
ఫ అవసరం కోసం లేదా కావాలని పశువుల శరీరానికి హాని కలిగించే మందులు, పదార్థాలను ఇవ్వకూడదు. కొందరు పశువుల యజమానులు పాల దిగుబడిని పెంచేందుకు అనవసరంగా మందులను ఇచ్చి బాధిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది.
ఫ పశువులను ఒకచోట నుంచి మరోచోటకు తరలిస్తున్నప్పుడు వ్యాన్లు, ఆటోల్లో కిక్కిరిసేలా ఉంచరాదు. వాటికి బాధ కలిగించకుండా తరలించే ఏర్పాటు చేయాలి. ఒక వాహనంలో పరిమితికి మించి పశువులను తరలించడం నేరం.
ఫ అలాగే పశువులు, జంతువులను ఎక్కువ సేపు కట్టేసి ఉంచడం కూడా నేరమే.
ఫ జంతువులు, పక్షులను పందెం కోసం వాడడం, చిత్రహింసకు గురిచేయడం, చంపడాన్ని చట్టం నిషేధించింది.
ఫ వధశాలలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. చూడితో ఉన్న, మూడు నెలల కంటే తక్కువ వయసున్న జంతువులను వధించరాదు. పశు వైద్యాధికారి పరీక్షించిన తర్వాతే జంతువును వధించాలి. లేదంటే నేరంగా పరిగణిస్తారు.
వన్యప్రాణులకూ రక్షణ
వన్య ప్రాణులను వేటాడడం, వాటిని ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలు శిక్షార్హం. ఇలాంటి నేరాలకు పాల్పడితే సెక్షన్–1 (ఏ) ప్రకారం జరిమానా విధిస్తారు. మూడేళ్లలో మరోసారి ఇలాంటి తప్పు చేసినట్లు రుజువైతే జరిమానాతో పాటు మూడు నెలల శిక్ష కూడా విధిస్తారు.
ప్రత్యేక నిఘా ఏర్పాటు
మూగజీవాలను హింసిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వాటి హక్కుల రక్షణకు చట్టాలున్నాయి. వాటిని అక్రమంగా తరలించడంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఇస్తే కేసులు నమోదు చేసి, మూగజీవాలను రక్షిస్తాం.
– బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం
పరిశీలించిన తర్వాతే రవాణా
పశువులు, జంతువులను రవాణా చేసేటప్పుడు స్థానిక పశువైద్యాధికారి వాటిని పరిశీలించి, అవి ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే తరలించాలి. అప్పుడే ఈనిన పశువు లేదా అనారోగ్యంతో ఉన్న పశువును తరలించడం నేరం. చూడితో ఉన్న పశువు, లేగదూడలను వేరే పశువులతో కలిపి రవాణా చేయడం నేరం.
– ఎం.బిందు, పశు వైద్యాధికారి, మాచవరం

మూగజీవాలకూ హక్కులున్నాయ్..

మూగజీవాలకూ హక్కులున్నాయ్..