
పశువుల అక్రమ తరలింపుపై కేసు
గండేపల్లి: పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు చేసినట్టు సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలంలోని గండేపల్లి జాతీయ రహదారిపై ఎస్సై యు.వి.శివనాగబాబు, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో తుని నుంచి చిలకలూరిపేటకు అక్రమంగా తరలిస్తున్న 4 ఆవు దూడలు, 12 ఎద్దులను గుర్తించి వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలియజేశారు
వ్యక్తి మృతికి కారణమైన
యువకుడి అరెస్ట్
రామచంద్రపురం రూరల్: ఈ నెల 22వ తేదీ రాత్రి సుమారు 11.45 గంటలకు జగన్నాయకులపాలెం గ్రామంలో ప్రధాన రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళుతున్న తాళ్లపొలం గ్రామానికి చెందిన వనుం కృష్ణను గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోగా అతడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. ప్రమాద సంఘటన జరిగిన తరువాత ఆ స్థలంలో లభించిన కారు సైడ్ మిర్రర్, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కారు మండపేటలోని దుర్గా మల్లేశ్వరి మెకానికల్ షెడ్‌లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు, తనకు అందిన సమాచారం మేరకు రామచంద్రపురానికి చెందిన కారు డ్రైవర్ దామిశెట్టి వెంకట వర్షిత్‌ను జగన్నాయకులపాలెం గ్రామంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు దాటిన తరువాత గున్నయ్య తూము వద్ద ఆదివారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.