
డైరెక్టర్ల అసమర్థత వల్లే అన్యాయం
అమలాపురం టౌన్: జయలక్ష్మి ఎంఏఎం కోపరేటివ్ సొసైటీ ప్రస్తుత బోర్డు డైరెక్టర్ల అసమర్థత వల్లే బాధితులకు నేటికీ అన్యాయం జరుగుతోందని బాధితుల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ యీరంకి రఘు భూషణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు డైరెక్టర్లు తక్షణం రాజీనామా చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమలాపురంలోని ఏఎస్‌ఎన్ కళాశాల ప్రాంగణంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్టా జిల్లాలకు చెందిన సొసైటీ బాధితులు ఆదివారం సమావేశమై బోర్డులో జరుగుతున్న అవకతవకలపై చర్చించారు. సొసైటీ బోర్డు తిప్పేసి ఏళ్లు గడుస్తున్నా బాధితులకు ఒక్క రూపాయి కూడా న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీ అమలాపురం బ్రాంచి బాధితుడు టీవీడీఎన్ ప్రసాదరావు మాట్లాడుతూ సొసైటీలో ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలను సమావేశానికి వివరించారు. సొసైటీ బాధితుడు, విశ్రాంత బ్యాంక్ అధికారి గుళ్లపల్లి వెంకటరామ్ మాట్లాడుతూ పారదర్శకత లేని ప్రస్తుత బోర్డు వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు 80 మంది డిపాజిటర్లు మరణించారని, బాధితులకు న్యాయం చేయలేని అమలాపురానికి చెందిన ఇద్దరు డైరెక్టర్లు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క అమలాపురం శాఖ పరిధిలోనే దాదాపు రూ.50 కోట్ల వరకూ డిపాజిట్లు చేసి నష్టపోయారని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన అమలాపురానికి చెందిన బోర్డు డైరెక్టర్లు స్వామి ప్రసాద్, గవర్రాజు కుమార్‌లను బాధితులు తమ డిపాజిట్ల కోసం నిలదీసినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. సొసైటీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసి డైరెక్టర్ల చేత రాజీనామాలు చేయించి తాజాగా కొత్త బోర్డును నియమించాలని సమావేశం నిర్ణయిస్తూ ఓ కార్యచరణ ప్రకటించింది. సొసైటీలో డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులంతా ఒక తాటిపై ఉండి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని తీర్మానించింది. సమావేశంలో మహిళా బాధితులు కూడా వచ్చి తమ నిరసన తెలియజేశారు. సమావేశంలో సొసైటీ బాధితులు పుత్సా కృష్ణ కామేశ్వర్, వి.సుబ్బారావు, కస్తూరి రవికుమార్, పిల్లి గణేష్, చక్రవర్తి, బదరీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
జయలక్ష్మి సొసైటీ బాధితుల ఆవేదన పాతవారి స్థానంలో కొత్త డైరెక్టర్లను
ఎన్నుకోవాలని కార్యాచరణ ప్రణాళిక
అమలాపురం సమావేశంలో నిర్ణయం