సమావేశంలో మాట్లాడుతున్న గజల్ శ్రీనివాస్
దేవరపల్లి: తెలుగు భాషను వికసింపజేసే లక్ష్యంతో 72 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన తెలుగు సారస్వత పరిషత్‌ను పునరుద్ధరింపజేసే లక్ష్యంతో వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో రెండో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని ఆ పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. మానవత సంస్థ గౌరవాధ్యక్షుడు కేశిరాజు సీతారామయ్య నివాసంలో పరిషత్ గోపాలపురం నియోజకవర్గ శాఖ సమావేశం ఆదివారం దేవరపల్లిలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యాన రాజరాజనరేంద్రుని పట్టాభిషేకం సహస్రాబ్ది నీరాజనంగా రాజమహేంద్రవరంలో ఈ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రాచీన కవుల కుటుంబాలకు పురస్కారాలు అందజేస్తామన్నారు. సభా ప్రాంగణంలో మూడు వేదికలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహాసభలకు ఆరు రాష్ట్రాల గవర్నర్లు, నలుగురు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు, పీఠాధిపతులు, హైకోర్టు న్యాయమూర్తులు, 50 దేశాల నుంచి ప్రముఖులు హాజరవుతారని వివరించారు. వివిధ సాహిత్య ప్రక్రియలపై సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వెయ్యి మంది కవులతో కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారు 15 వేల మంది విద్యార్థులు తెలుగు భాష, సంస్కృతిపై వివిధ కార్యక్రమాలు ప్రదర్శిస్తారన్నారు. ఆంధ్రమేవ జయతే నినాదంతో సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరో తేదీన తెలుగు సాహిత్య సభ ఏర్పాటు చేశామన్నారు. దేశంలోని అన్ని తెలుగు సమాజాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. మహాసభలను పురస్కరించుకుని వచ్చే నెల రెండో తేదీన రాజమహేంద్రవరంలో 15 వేల మందితో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో పరిషత్ నియోజకవర్గ శాఖ అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, సహాయ సంచాలకుడు కేశిరాజు రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
