మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో టీడీపీ నేత కిలపర్తి శ్రీనివాస్(ఫైల్)
బాటిల్‌పై రూ.10 ఎక్కువ అమ్మడంపై మాట్లాడతాం
ఒక్కో షాప్‌నకు రూ.1.40 లక్షలు తీసుకుంటున్నాం
ఎమ్మెల్యే దగ్గర ఒప్పందం చేద్దాం... డబ్బు చేర్చండి
రాజమహేంద్రవరం టీడీపీ నేత, ఎమ్మెల్యే అనుచరుడు కిలపర్తి శ్రీనివాస్ ఆడియో బట్టబయలు
మద్యం షాపు యజమానితో మామూళ్ల బేరసారాలతో అడ్డంగా బుక్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైనం
ఇప్పటికే మరో టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆడియో వైరల్
సాక్షి టాస్క్‌ఫోర్స్: లిక్కర్ సిండికేట్‌లో టీడీపీ నేతల ప్రమేయం మరోసారి బట్టబయలైంది..! తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లిక్కర్ సిండికేట్‌లో మామూళ్ల వసూళ్లకు సంబంధించి అధికార పార్టీకి చెందిన మరో నేత అడ్డంగా బుక్కయ్యారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడు కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కో మద్యం షాప్‌నకు రూ.1.40 లక్షల చొప్పున వసూలు చేయాలంటూ షాప్ యజమానితో ఆయన మాట్లాడడం సంచలనంగా మారింది. అందులోని వివరాల ప్రకారం, ‘నేను (కిలపర్తి శ్రీనివాస్), మురళి, బాలు, రాంబాబు అందరం కూర్చుని మాట్లాడుకున్నాం.
ఎమ్మెల్యేకు (మామూళ్ల) అమౌంట్ సెట్ చేశాం. బాటిల్‌పై అదనంగా రూ.10కి అమ్ముకునే విషయం బాలు ఎమ్మెల్యేతో మాట్లాడి సెట్ చేస్తాడు. షాప్‌నకు రూ.1.40 లక్షలు వసూలు చేస్తున్నాం. చాలామంది ఇచ్చేశారు’. (‘బాగా పెరిగిందండీ..’ అని షాప్ ఓనర్ అన్నారు). డిపార్ట్‌మెంట్‌కు ఏం ఇవ్వాలి అన్నది లెక్కలు ఉంటాయి. రూ.100 స్టాంప్ పేపర్‌పై రాసుకుని, 20 మందితో మాట్లాడి ఎమ్మెల్యే దగ్గరపెట్టి చేద్దాం. మీరు మాత్రం రేపు 11 గంటలకు డబ్బు చేర్చుతారా..?’ అని పేర్కొన్నారు. కాగా, ఆ గొంతు తనది కాదని, ఏఐ ద్వారా సృష్టించారని కిలపర్తి శ్రీనివాస్ మాత్రం ప్రకటన విడుదల చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే మజ్జి రాంబాబు ఆడియో వైరల్ 
కొద్ది రోజుల క్రితం ఓ మద్యం షాపు యజమానితో ఎక్సైజ్ శాఖకు ఎంత ఇవ్వాలి? మద్యం ధర ఎంత పెంచి అమ్మాలి? అనే విషయమై రాజమహేంద్రవరం టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆడియో బహిర్గతమైంది. ఇది జరిగి నెలలు గడవకముందే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి  ఆడియో బయటకు రావడం గమనార్హం. బండారం పదేపదే బయటపడుతున్నా ఏమాత్రం సిగ్గు లేకుండా మద్యం దందా కొనసాగిస్తున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు  వస్తున్నాయి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
