పిఠాపురం మున్సిపల్‌ ఆఫీసు వద్ద చెత్త వేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ

- - Sakshi

పిఠాపురం: టీడీపీ ‘కుళ్లు’ రాజకీయాలకు తెర లేపింది. నిరసన పేరుతో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ మంగళవారం మురికి కాలువల్లోని మురికి, చెత్త తెచ్చి మున్సిపల్‌ కార్యాలయం వద్ద వేశారు. ఈ సంఘటన పట్టణ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. గడప గడపకూ మన ప్రభుత్వం కింద సచివాలయాలకు విడుదల చేసిన నిధులతో పట్టణంలోని మురికి కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. తక్షణమే కాలువలను గుర్తించాలన్నారు. నెల రోజులుగా మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి పర్యటించి వర్షాలకు ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరి, కాలువలు మూసుకుపోయి సమస్య ఉత్పన్నమవుతోందని గుర్తించారు. ఆయా కాలువల అభివృద్ధికి పనులు చేపట్టారు.

ఏ పని చేస్తూంటే దానిపై ఆందోళన
ప్రభుత్వం ఏ మంచి పని చేసినా బురద జల్లి ఆందోళన చేయడం.. పని పూర్తి అవ్వగానే తమ వల్లేనంటూ గొప్పలు చెప్పుకోవడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారింది. ఇందులో భాగంగానే మురికి కాలువల అభివృద్ధి పనులు చేస్తూంటే.. మరోపక్క ఆ పార్టీ నాయకుడు వర్మ వార్డుల్లో తిరుగుతూ మురికి కాలువలు శుభ్రం చేయడం లేదంటూ విమర్శిస్తున్నారు. ప్రధాన కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకున్నా ఏమీ పట్టించుకోవడం లేదంటూ కాలువల మురికిని వాహనాలపై తెచ్చి స్వయంగా మున్సిపల్‌ కార్యాలయం ముందు వేశారు. ఎమ్మెల్యే దొరబాబుపై విమర్శలు గుప్పించారు.

మండిపడిన కౌన్సిలర్లు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు
వర్మ తీరుపై మున్సిపల్‌ కౌన్సిలర్లు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యత గల నాయకుడు ఇలా మూర్ఖంగా మురికిని తెచ్చి కార్యాయం వద్ద వేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తెచ్చిన మురికితోనే వర్మ చిత్రపటానికి అభిషేకం చేశారు.

వర్మపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని నినదించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ, వర్మకు పిచ్చి ముదిరి ఇలాంటి పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఐదేళ్ల పాలనలో పట్టణ పారిశుధ్యాన్ని గాలికొదిలేశారన్నారు. మురికి తెచ్చి ఇక్కడ వేయడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు సర్ది చెప్పి, ఆందోళన విరమింపజేశారు.

18 మందిపై కేసు

మున్సిపల్‌ కార్యాలయంపై దౌర్జన్యంగా మురికి వేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ సహా 18 మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు తెలిపారు. మున్సిపల్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top