ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
సాక్షి, అమలాపురం: కనీస మద్దతు ధరకు తమ వద్ద ఉన్న బొండాల రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. కూటమి పార్టీకి చెందిన రైతు సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమని వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఎద్దేవా చేశారు. అమలాపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నో కష్టాలు పడి, అప్పులు చేసి మరీ రైతులు పంట పండిస్తే అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈసారి జిల్లాలో బొండాల రకం ధాన్యాన్ని ఎక్కువ పండించారు. వీటిని కొనుగోలు చేయాలంటే రైసు మిల్లర్లు సిండికేటుగా మారి కొనడం లేదని ఇజ్రాయిల్ ఆరోపించారు. దీని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లా యూనిట్‌గా కాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను యూనిట్‌గా పరిగణించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే అకాల వర్షం వల్ల రైతులు దెబ్బతిని ఉన్నారని, ప్రభుత్వం వెంటనే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


