● ధాన్యం అమ్ముకోలేక రైతులు
నలిగిపోతున్నారు
● ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
రామచంద్రపురం: రబీ మాసూళ్ల సీజన్‌లో జిల్లా రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. స్థానిక గాంధీపేట వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండో పంట ప్రొక్య్రూర్‌మెంట్ విధానాన్ని మెరుగు పర్చాలని సీఎం చంద్రబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్లు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సరపడినన్ని రైస్ మిల్లులు ఉండటంతో ఇబ్బందులు ఉండేవి కావని, జిల్లాల విభజన అనంతరం ఈ జిల్లాలో 16 మిల్లులు మాత్రమే ఉన్నాయని, వాటిలోనే కొనుగోలు చేసేందుకు అనుమతించారని బోస్ అన్నారు. ఎంఎస్‌పీ ప్రకారం 75 కేజీల ధాన్యం బస్తా రూ.1778 కాగా రైస్ మిల్లులు రూ.462 కోట్లకు బ్యాంకు హామీని ఇవ్వాల్సి ఉందని, అయితే ఈ 16 రైస్ మిల్లులు ఆ మేరకు గ్యారెంటీ ఇవ్వడం సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరగకపోతే రైతులు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ధాన్యం కొనుగోలు చేయడమే దీని పరిష్కారమని ఎంపీ ప్రభుత్వానికి సూచించారు. గత మోంథా తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా సీఎం చంద్రబాబు ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం ఒక్కటే ప్రభుత్వ బాధ్యత కాదని, మిగిలిన రంగాలను కూడా అభివృద్ధి చేయకుంటే రాష్ట్రం దెబ్బతింటుందని ఆయన అన్నారు. పంట మాసూళ్లు పూర్తి కాకుండానే కొంత మేర కొనుగోళ్లు చేయాలని, ప్రభుత్వం లక్ష్యాలు విధిస్తే రైతులు ఏమై పోవాలని ఆయన ప్రశ్నించారు. ఇదే అదనుగా దళారులకు రూ.1600కే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడిందని ఆయన అన్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎంఎస్‌పీకి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అప్పట్లో రైతులు హర్షం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. తండ్రిని కోల్పోయి పౌరసఫరాల శాఖ మంత్రి మనోహర్ తీవ్రమైన భాదలో ఉన్నారని, ఆయన బదులుగా చంద్రబాబు ఆ బాధ్యత తీసుకుని అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. కేవలం లక్ష మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయండని చెప్పి చేతులు దులుపుకోవటం సమజసం కాదని ఎంపీ బోస్ అన్నారు.


