పెట్రోలు దొరకక వాహన చోదకుల ఇబ్బందులు
యానాం: పట్టణ పరిధిలోని పెట్రోలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుమ్మళ్లదొడ్డి పెట్రోలియం కాంప్లెక్స్ నుంచి ఒక్కో బంకుకు ఒక్కో పెట్రోల్ ట్యాంకర్ వస్తుందని, మరి ఆ పెట్రోలు ఏమవుతోందని వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి యానాంతో పాటు ఇతర ప్రాంతాల్లో బంకుల్లో సైతం ఒక్క లీటరు పెట్రోల్ కూడా అందుబాటలో లేదు. పెట్రోలియం డీలర్లతో ఇటీవల ఆర్‌ఏఓ శివరాజ్‌మీనా సమావేశమై చర్చించినప్పటికీ వారిలో మార్పు లేదని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌లో 20 వేల లీటర్ల డీజిల్, పెట్రోల్ వస్తుందని, బంకుల వద్ద సంబంధిత తూనికలు, కొలతలు, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని స్థానికులు అంటున్నారు.
రైతుల ఆస్తికి భరోసా కల్పించాలి
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు తమ ఆస్తిపై పూర్తి భరోసా కల్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ఇతర ఉన్నత కార్యదర్శులు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 22 ఏ భూముల తొలగింపు కేసులు రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ పురోగతిపై కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే చేపట్టి భూ రికార్డుల ప్రక్షాళన, స్వచ్ఛీకరణ ద్వారా భవిష్యత్‌లో భూ వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు జి.మమ్మీ పాల్గొన్నారు.


