– ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
కోరుకొండ: కొద్దిరోజులుగా జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ హడలెత్తిస్తున్న పెద్ద పులి గురువారం ఉదయానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం వద్దనున్న పాండవుల మెట్ట ప్రాంతానికి చేరింది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొండ వైపు నుంచి నడచిన పులి అడుగుల ఆధారంగా అటవీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఫారెస్టు అధికారులు, రిస్క్యూ టీమ్, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టారు. కోరుకొండ, కాపవరం, మునగాల, శ్రీరంగపట్నం గ్రామాల్లో ప్రచారం చేశారు. డీఎఫ్‌ఓ వి.ప్రభాకరరావు ఘటనా స్థలిలో విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 6 వ తేదీన ఈ పులిని పాపికొండలు అటవీప్రాంతంలో విడిచిపెట్టినట్టు తెలిపారు. అక్కడి నుంచి ఈ జిల్లాకు వస్తుందని నిన్న గుర్తించి, కలెక్టర్, ఇతర అధికారులకు తెలియజేశామన్నారు. పులి పగటి వేళల్లో విశ్రాంతి తీసుకుంటోందని, మనుషుల జోలికి వెళ్లడం లేదన్నారు. నాలుగురోజులకోసారి ఆహారం తీసుకుంటోందన్నారు. రాజమహేంద్రవరం ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రిస్క్యూ టీమ్ పులికోసం ఆవును ఎరగా ఉంచి, సమీపంలో మాటు వేసింది. ఉదయం మెట్టపైకెక్కిన పులి, మధ్యాహ్నం ఎండ వేడికి కిందికి దిగింది, మెట్ల కింది భాగంలోని వెదురుపిడెం వద్ద సంచరించింది.
రాత్రి వేళల్లో గట్టి చర్యలు
పెద్దపులి పాండవుల మెట్టమీద నుంచి కిందికి దిగుతుందన్న అనుమానంతో పటిష్టమైన చర్యలు గురువారం రాత్రి పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు నార్త్‌జోన్ డీఎస్పీ జీవన, కోరుకొండ తహసీల్దార్ సుగుణ తెలిపారు.


