● బోటు రిజిస్ట్రేషన్ పేరుతో దోపిడీ
● సుమారు రూ.40,57,000 నొక్కేసిన వైనం
● లబోదిబోమంటున్న మత్స్యకారులు
కాట్రేనికోన: మండల పరిధిలోని పలు గ్రామాల్లో బోట్ల రిజిస్ట్రేషన్ పేరుతో మత్స్యశాఖ అధికారులతో కుమ్మకై ్కన తెలుగు తమ్ముళ్లు భారీ మొత్తంలో దోచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని బలుసుతిప్పకు చెందిన అధికార పార్టీ నాయకులు ఇద్దరు కలిసి 156, ఒకరు 54, మరొకరు 76, ఇంకొకరు 57 బోట్లకు రూ.10 వేలు చొప్పున సుమారు రూ.34,30,000, ఒకరు 57 బోట్లకు రూ.11 వేలు చొప్పున రూ. 6,27,000 మొత్తం రూ.40,57,000 వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏడాది గడిచినా రిజిస్ట్రేషన్ చేయించకపోవడం, కనీసం తాము చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని పల్లం, కొత్తపాలెం, మొల్లేటిమొగ, కాట్రేనికోనలో ఈ తరహా వసూళ్లు చేసినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కోసం కొంత సొమ్మును అధికారులకు ఇచ్చామని, రెండు నెలల్లో బోట్లు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని, ఈ ఏడాది మత్స్యకార భరోసా సొమ్ము వచ్చేలా చూస్తామని టీడీపీ నేతలు బుజ్జగిస్తుండడంతో బాధితులు ఈ విషయమై ఎవరికీ ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోయారు. గతంలో కాట్రేనికోన మత్స్యశాఖ కార్యాలయంలో సిబ్బంది సహకారంతో కొన్ని బోట్లకు రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం బోట్లకు రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో అధికార పార్టీ నేతలు దోచేస్తున్నారు.
దళారులను ఆశ్రయించడంతో మోసం
సముద్ర, నదీ జలాలలో చేపల వేట కోసం వినియోగించే బోటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. సముద్ర వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవనోపాధి కోసం చేపల వేట నిషేధ సమయం 61 రోజులకు ప్రభుత్వం మత్స్యకార భరోసా రూ.20 వేలు చెల్లిస్తుంది. దీంతో బోటు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తమకు మత్స్యకార భరోసా సొమ్ము వస్తుందని లబ్ధిదారులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. దీనిపై ఎఫ్‌డీఓ చలపతితో మాట్లాడగా బోట్లు రిజిస్ట్రేషన్ కోసం నగదు వసూలు విషయం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా దళారులు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. మత్స్యకారులు తమ సమస్యలపై మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కార్యాలయానికి ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.


