దేవీపట్నం: రెండు రోజుల క్రితం గోదావరి నదిని దాటుకుని దేవీపట్నం వైపు వెళ్లిన పెద్ద పులి నేలకోట వద్ద కొండపై తిష్టవేసింది. మంగళవారం రాత్రి నాగళ్లపల్లి వద్ద నుంచి రామదుర్గం కొండను దాటుకుని సమీపంలో శరభవరం వైపున కొండపైకి చేరింది. ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు సిబ్బందితో కలసి పులి గమనాన్ని పర్యవేక్షిస్తున్నారు. పులి సంచారంపై సమీప గ్రామాలైన దేవారం, శరభవరం, పోతుకొండ, నేలకోట గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అడవి, తోటల్లోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. పులి మెడకు అమర్చిన ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు పులి పయనాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. బుధవారం రాత్రికి పులి కొండ దిగితే శరభవరం నేలకోట రహదారిని దాటుకుని సీతానగరం మండలంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.


