అరవ చాకిరీ.. అరకొర జీతం
● సాటి ఉపాధ్యాయులతో
సమంగా పని ఒత్తిడి
● ఏడాదిలో 11 నెలలు మాత్రమే వేతనం
● 62 ఏళ్లకు పెరగని
ఉద్యోగ విరమణ వయసు
● పెన్షన్ సౌకర్యానికీ దూరం
● తీరని ఎంటీఎస్ టీచర్ల సమస్యలు
● ఏమాత్రం పట్టించుకోని
చంద్రబాబు సర్కారు
అమలాపురం టౌన్: పాతికేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 1998 మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇచ్చింది. అది కూడా సంవత్సరానికి 11 నెలలు మాత్రమే పనిచేయాలి. మిగతా నెలకు జీతం ఉండదు. పోరాటాలతో అలసిసొలసిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల్లో చాలామంది ఉద్యోగ విరమణకు దగ్గర పడ్డారు. ఈ క్రమంలో తమకూ రిటైర్‌మెంట్ వయసు మిగతా ఉద్యోగుల మాదిరిగానే 62 సంవత్సరాలకు పెంచాలని, 12 నెలలూ జీతాలు ఇవ్వాలని, తమను రెగ్యులర్ చేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లాలోని 103 మంది ఎంటీయూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వెతలివి. నెలకు ఎంటీయూ ఉపాధ్యాయుడి జీతం రూ.32,600. ఈ అరకొర జీతం అదీ 11 నెలలకే ఇవ్వడంతో ఎలా బతకాలి, తమ కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుడి విధులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే సర్వీస్ విషయాలు, ఆర్థిక అంశాలు వచ్చేసరికి మాత్రం తమను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులమనే చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వెట్టిచాకిరీ మాదిరిగా పనులు చేయించుకుంటున్నప్పటికీ తాము అడుగుతున్న న్యాయమైన కోర్కెలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు. తమ సమస్యలను చంద్రబాబు ప్రభుత్వానికి అనేకసార్లు చెప్పుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో తమను 50 కిలోమీటర్ల పైగా దూరం ఉన్న పాఠశాలలకు బదిలీలు చేశారని, రిటైర్‌మెంట్ వయసు దగ్గర పడుతున్న వేళ, అరకొర జీతాలతో అంతదూరం వెళ్లి విధులు నిర్వహించడం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు.
వివక్షకు గురవుతున్నాం
ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రూ.లక్షకు పైగా జీతాలు తీసుకునే రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నాం. అయినా వివక్షకు గురవుతున్నాం. విజయవాడలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్‌ను బుధవారం కలసి మా ఇబ్బందులు వివరించాను. సమస్యల పరిష్కారంలో తోడ్పాటుగా ఉండాలని కోరాను.
– చొల్లంగి కేశవకుమార్, అధ్యక్షుడు,
ఎంటీఎస్ ఉపాధ్యాయుల రాష్ట్ర ఫెడరేషన్


