పాము కాటుకు చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

పాము కాటుకు చిన్నారి మృతి

Feb 27 2026 7:36 AM | Updated on Feb 27 2026 7:36 AM

పాము

పాము కాటుకు చిన్నారి మృతి

నల్లజర్ల: పాము కాటుకు గురై ఓ చిన్నారి మృతి చెందింది. ఆ వివరాల ప్రకారం.. అనంతపల్లిలో చోడవరం రహదారి పక్కన నివాసం ఉంటున్న తీగల ప్రకాష్‌, ధనలక్ష్మి దంపతుల కుమార్తె వన్సిక (3) బుధవారం సాయంత్రం ఆరుబయట మూత్ర విసర్జనకు వచ్చింది. పక్కనే చెత్తలో ఉన్న తాచుపాము ఆమెను కాటేసింది. జరిగిన సంఘటన తల్లికి చెప్పి ఆ బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆ బాలికను చికిత్స నిమిత్తం నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు సమీప బంధువులు తెలిపారు. ఆ బాలిక తండ్రి ప్రకాష్‌ ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. కుమార్తె మరణ వార్త విని స్వస్థలానికి తిరిగి వస్తున్నారు.

గీత కార్మికుడు..

చాగల్లు: పాము కాటుకు గురై ఓ కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లుకు చెందిన దొంగ వెంకటేశ్వరరావు (51) గీత కార్మికుడు. నెలటూరు గ్రామ పరిధిలోని రుద్రబోయిన బుల్లిరాజుకు చెందిన పొలంలో తాటిచెట్ల వద్దకు వెళ్లి కల్లు తీయడానికి వెళ్తుండగా విష సర్పం కాటేసింది. అతన్ని వెంటనే బంధువులు చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా, మార్గం మధ్యలోనే మృతి చెందారు.

భార్యపై కత్తితో దాడి

అన్నవరం: మద్యం మత్తులో భార్యపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. అన్నవరం గ్రామ శివారు కొత్తపేటలో భార్యాభర్తలు ఆవాల శ్రీను, రత్నం నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనుకు అతని భార్యతో తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం మధ్యాహ్నం శ్రీను మద్యం తాగి కత్తితో రత్నంపై దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను హుటాహుటిన తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. శ్రీనుపై కేసు నమోదు చేశామని అన్నారు.

కంటైనర్‌, కారు ఢీ

శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై కంటైనర్‌, కారు ఢీకొన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. సీతంపేట సమీపంలో కంటైనర్‌, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఆ వాహనాలను తనిఖీ చేశారు.

చైన్‌ స్నాచర్లను

పట్టుకున్న ప్రజలు

ఐ.పోలవరం: ఓ మహిళ మెడలో బంగారు ఆభరణాలను చోరీ చేసిన చైన్‌ స్నాచర్లను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై రవీంద్రబాబు కథనం ప్రకారం.. మురమళ్ల నుంచి పశువుల్లంకకు బైక్‌పై వెళుతున్న దంపతులను వెంబడించి మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు అంగతకులు లాక్కుని మోటారు సైకిల్‌పై పరారయ్యారు. దీనిని గుర్తించిన స్థానికులు వారిని వెంబడించారు. సలాదివారిపాలెం లంకలో వారిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. బాధితురాలు రాజ్యలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు.

పాము కాటుకు చిన్నారి మృతి 1
1/2

పాము కాటుకు చిన్నారి మృతి

పాము కాటుకు చిన్నారి మృతి 2
2/2

పాము కాటుకు చిన్నారి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement