గాండ్రింపులివి..! | - | Sakshi
Sakshi News home page

గాండ్రింపులివి..!

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

గాండ్రింపులివి..!

గాండ్రింపులివి..!

రంపచోడవరం: మన్యంలో పెద్ద పులి సంచారంతో పెదకొండ గిరిజనులు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో అనేది తెలియక ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన పులిని పాపికొండలు నేషనల్‌ పార్కులో విడిచిపెట్టగా, అది మారేడుమిల్లి మండలం రామన్నవలస, సున్నంపాడు మీదుగా రంప, పెదకొండ ప్రాంతానికి చేరుకుందని ఓ అధికారి చెబుతున్నారు. పెదకొండ గ్రామానికి ఆనుకుని ఉన్న కొండపోడు, చేను మకాంలో ఆవు, దూడలపై బుధవారం రాత్రి ఆ పులి దాడి చేసింది. ఆవు మెడపై గాయపరచడంతో పశు వైద్యులు 12 కుట్లు వేశారు. దూడను కూడా మెడపై కరిచింది. రంప కొండపై జలపాతం నుంచి పెదకొండ గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి పులి చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాపికొండలు నేషనల్‌ పార్కు నుంచి సున్నంపాడు మీదుగా సీతపల్లి వాగు దాటి పులి రంప వచ్చిందని దానికి అమర్చిన జియో ట్యాగ్‌ ద్వారా తెలిసిందని మంగళవారం ఇక్కడి అధికారులు వివరించారు. అయితే అదేరోజు రాజమహేంద్రవరంలో సీసీఎఫ్‌ నీలకంఠరెడ్డి రంప ప్రాంతంలోకి వచ్చిన పులి, పాపికొండల్లో వదలిపెట్టిన పులి ఒకటి కాదని చెప్పారు. ఇద్దరు అటవీ ఉన్నతాధికారులు పులి కదలికలపై భిన్నమైన సమాచారాన్ని చెప్పారు. ఈ పరిస్థితుల్లో గిరిజనుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.

జీడిపిక్కల సీజన్‌ కావడంతో...

జిల్లాలో గిరిజనులకు ఆదాయ వనరుల్లో జీడిపిక్కల సేకరణ ప్రధానమైంది. ఈ సీజన్‌లో కొండపోడు, జీడిమామిడి తోటల్లో జీడిపిక్కలను సేకరించి అమ్ముకుంటారు. ప్రస్తుతం పూత దశలో ఉండడంతో జీడిమామిడి తోటలను శుభ్రం చేసుకోవడం, పూత రాలిపోకుండా మందులు పిచికారీ చేయించడం వంటివి చేయించుకుంటారు. పులి భయంతో వారు జీడిమామిడి తోటలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పెదకొండ నుంచి దిగువన చుట్టుపక్కల సుమారు 30 గ్రామాల వరకూ ఉన్నాయి. పులి ఎప్పుడు ఎలా వస్తుందోననే భయందోళనలో గిరిజన రైతులు ఉన్నారు. పులిని పట్టుకుని మరోచోట వదిలి పెట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆవు, దూడలపై దాడి చేసిన పులి గ్రామంలోకి వస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. రక్షణ లేని పూరి పాకల్లో అనేక మంది నివాసం ఉంటున్నారు. వాటికి తలుపులూ ఉండవు. ప్రస్తుతం పులి గ్రామానికి కిలోమీటరు దూరంలోని కొండల్లో ఉంది. దీంతో భయాందోళన నెలకొంది. ఇదిలా ఉంటే పులి పంజాతో దూడ మెడపై గాట్లు పెట్టిందని, దాని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రంపచోడవరం పశు సంవర్ధక శాఖ డీడీ షరీఫ్‌ అన్నారు. పశు వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఆవుకు మెడపై కుట్లు వేశామని, ఆహారం తీసుకోకపోవడంతో నీరసంగా ఉందన్నారు. సైలెన్‌ ఎక్కిస్తున్నామని తెలిపారు.

ఫ మన్యంలో పులి సంచారంపై

భిన్న కథనాలు

ఫ ఒకే శాఖ అధికారుల్లో సమన్వయ లోపం

ఫ పెదకొండలో రెండు మూగజీవాలపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement