ఎరువుల లోడ్ లారీ సీజ్
సామర్లకోట: అనధికారికంగా ఎరువులతో లారీ వెళుతోందనే సమాచారం మేరకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గుర్తించి లారీని సీజ్ చేశారు. తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి, మండల వ్యవసాయాధికారి వంగపండు మురళీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం కాకినాడ నుంచి ఎటువంటి పత్రాలు లేకుండా ఎరువుల లోడ్‌తో లారీ వెళుతుందనే సమాచారంతో లారీని తనిఖీ చేశామన్నారు. తాము వచ్చే సమయానికి లారీని కెనాల్ రోడ్డు మాండ్యనారాయణస్వామి ఆలయం వద్ద నిలిపి వేసి డ్రైవర్ పరార్ కావడంతో అనుమతి లేని ఎరువులుగా నిర్ధారణ అయిందన్నారు. కంపెనీ నుంచి ఎరువులు తీసుకొని వెళితే బ్యాగ్‌లకు సీల్ ఉండాలని, అయితే మూటలుగా ఉన్నాయని తెలిపారు. ఒక బస్తాలో గుర్తించిన దాని ప్రకారం పొటాష్ ఎరువుగా భావిస్తున్నామని తెలిపారు. అయితే ఈ పొటాష్ నకిలీయా, అసలు ఎరువా అనే విషయం గుర్తించవలసి ఉందన్నారు. లారీలో ఉన్న ఎరువుల శ్యాంపిల్స్ తీసి పరిశోధనకు పంపించామని చెప్పారు. తనిఖీలో వ్యవసాయ శాఖ ఏడీఏ దుర్గాలక్ష్మి, ఏఈఓలు కమలశాంతి, వీఆర్వో ఎన్ లోవరాజు పాల్గొన్నారు.


