సెకండరీ అగ్రికల్చర్‌పై పరిశోధనలు
● బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ సూచన
● నిర్కాలో శాసీ్త్రయ సలహామండలి
సమావేశాలు ప్రారంభం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రానున్న కాలంలో ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా పొగాకు పంట పూర్తిగా బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల నిర్కా సంస్థ వాణిజ్య పంటలలో సెకండరీ అగ్రికల్చర్ పట్ల పరిశోధనలు చేపట్టాలని బెంగళూరు వ్యవసాయ విద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ సూచించారు. రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య పరిశోధనా సంస్థ(నిర్కా)లో రెండురోజులపాటు జరిగే శాసీ్త్రయ సలహామండలి సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బెంగళూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరించగా, ఐ.సి.ఏ.ఆర్. ఏడీ జీ (వాణిజ్య పంటలు) డాక్టర్ ప్రశాంత్ కుమార్‌దాస్, ఐ.సి.ఏ.ఆర్ ఎన్.సి.ఐ.పి.ఎమ్.సీనియర్ సైంటిస్ట్ (రిటైర్డు) డా. ఓ.పీ.శర్మ, తమిళనాడు వ్యవసాయ విశ్వ విద్యాలయం మాజీ డీన్ డా. పుంగళేంది, హైదరాబాద్ నార్మ్ నుంచి విచ్చేసిన డా.రామ సుబ్రమణియన్, రైతు సభ్యులు సింహాద్రి, సుందరమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొగాకు, మిరప, అశ్వగంధ, ఆముదం పంటలకు సంబంధించి భవిషత్తు ప్రణాళికల కోసం శాసీ్త్రయ సలహాలను, సూచనలను అందించారు. సమావేశాలను డా.రాజేంద్రప్రసాద్, నిర్కా డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 29 ప్రాజెక్టులు బయటి మూలాల నుంచి స్పాన్సర్ అయ్యాయని, ఇవి 34 శాతం రెవెన్యూను ఇస్తున్నాయని నిర్కా డైరెక్టర్ డా.ఎం. శేషు మాధవ్‌ను అభినందించారు. సంస్థ ఆహార భద్రత కంటే పోషకాహార భద్రత ను సాధించాలని పేర్కొన్నారు. డాక్టర్ ఎల్.కె. ప్రసాద్, డా. కె. సరళ, డా. కె.రాజశేఖర్‌రావు తమ విభాగాలలో పరిశోధనల ఫలితాలను ప్రజెంట్ చేశారు.


