సాక్షి, తిరుపతి: ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వచ్చిన ఫిర్యాదులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 120 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విశాఖ, కోనసీమ, అన్నమయ్య, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది. కొనుగోలుదారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజం పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. కార్యాలయం తలుపులు మూసివేసిన ఏసీబీ అధికారులు.. సిబ్బందిని అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలం నుండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టింది. దీంతో అప్రమత్తమైన రైటర్లు వారి షాపులకు తాళం వేసుకొని పరారయ్యారు.





