కాదన్నందుకు కత్తి కట్టాడు

Young Man Who Stabbed The Young Woman In Hyderabad - Sakshi

పెళ్లికి నిరాకరించిందని యువతిపై హత్యాయత్నం

18 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది

యువతి ఆసుపత్రికి తరలింపు.. పరిస్థితి విషమం

నాగోలు: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కారణంగా కక్ష కట్టిన ప్రేమోన్మాది ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఏకంగా 18 సార్లు పొడిచాడు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నిందితుడిని ఎల్‌బీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ సమీపంలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన బస్వరాజు (23) నగరంలోని రాందేవ్‌గూడలో ఉన్న సన్‌సిటీలో ఉంటూ సెంట్రింగ్‌ పని చేస్తున్నాడు.

వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం చంద్రకాల్‌ గ్రామానికి చెందిన యువతి (20) గతేడాది లాక్‌డౌన్‌ నుంచి హస్తినాపురం సెంట్రల్‌లోని తన పిన్ని వద్ద ఉంటోంది. ఈమె ఇంటర్‌ పూర్తి చేసింది. బస్వరాజు అమ్మమ్మది కూడా చంద్రకాల్‌ కావడంతో ఇతడు తరచూ అక్కడికి వెళ్తుం డేవాడు. దూరపు బంధువైన ఆ యువతితో ఇతడికి పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల కింద ఆమె ఇంటికి వెళ్లిన బస్వరాజు.. తమ ప్రేమ విషయం చెప్పాడు. అయితే డిగ్రీ చదివినప్పటికీ సెంట్రింగ్‌ పని చేస్తున్న బస్వరాజుకు ఆమెను ఇచ్చి వివాహం చేయడానికి కుటుంబీకులు ఒప్పుకోలేదు.

ఇదిలా ఉండగా, ఆమెకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయం కావడంతో మూడు నెలల కింద నిశ్చితార్థం జరిగింది. ఈమెకు తరచుగా ఫోన్లు చేస్తున్న బస్వరాజ్‌ పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండేవాడు. దీంతో అతడి ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేసింది. అయినా వేరే నంబర్ల నుంచి కాల్స్‌ చేస్తూ వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఆమె బయటకు వెళ్లినప్పుడు వచ్చి కలుస్తుండేవాడు. ఆ సందర్భంలోనూ పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. అయితే తన కుటుంబీకులకు ఇష్టం లేకపోవడంతో పెళ్లి చేసుకోలేనంటూ ఆమె స్పష్టం చేసింది. 

18 కత్తిపోట్లు.. 
బుధవారం తన ఇంట్లో ఉండే కత్తిని తీసుకుని బస్వరాజు హస్తినాపురం వచ్చాడు. మధ్యాహ్నం 3:35 గంటల సమయంలో శిరీష ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంటి తలుపులు కొట్టడంతో శిరీష వచ్చి తీసింది. ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి వాగ్వాదానికి దిగాడు. విచక్షణ కోల్పోయిన అతగాడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె ఇంటి ముందే, నడిరోడ్డుపై దాడికి దిగాడు. తనను ఏమీ చేయొద్దని శిరీష ప్రాధేయపడినా, కాళ్లు పట్టుకున్నా బస్వరాజ్‌ కనికరించలేదు. కత్తితో విచక్షణారహితంగా చేతికి దొరికిన చోట పొడిచాడు. శిరీష చేతులు, వీపు, ఛాతీ, తొడ, కడుపు భాగాల్లో మొత్తం 18 కత్తిపోట్లు గాయాలయ్యాయి. దాదాపు 5 నిమిషాల పాటు పొడిచాడని తెలుస్తోంది. రక్తపు మడుగులో ఉన్న శిరీష అరుపులు విని బయటకు వచ్చిన పైఅంతస్తులో ఉండే వారు బస్వరాజ్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడు. అనంతరం ఫోన్‌ ద్వారా ఉషశ్రీకి సమాచారం ఇచ్చారు. వెంటనే శిరీషను హస్తినాపురంలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top