వివాహేతర సంబంధం బయటకు రాకూడదని..

Woman Assasinate Her Father In Law In Nalgonda - Sakshi

సాక్షి, శాలిగౌరారం(నల్లగొండ): వివాహేతర సంబంధం బయటకు రాకూడదని మామ శ్యామల ముత్తయ్య(60)ను ప్రియుడు సింగం మహేశ్‌తో కలిసి కోడలు శ్యామల శైలజ హత్య చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను గురువారం నకిరేకల్‌లోని శాలిగౌరారం సర్కిల్‌ కార్యాలయంలో ఆయన వెల్ల డించారు. వేములపల్లి మండలం లక్ష్మిదేవిగూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్యకు భార్య, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముత్తయ్య బాతుల పెంచుతూ జీవనోపాధి పొందుతుండేవాడు.

అందులో భాగంగానే బాతులను మేపేందుకని మండలంలోని మాధారంకలాన్‌ గ్రామానికి వారం రోజుల కిందట కొడుకు నర్సింహ, కోడలు శైలజతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో మాధారంకలాన్‌ గ్రామ సమీపంలోని చెరువుకట్ట కిందిభాగంలో తాత్కాలిక గుడిసె వేసుకుని కొడుకు, కోడలుతో కలిసి బాతులను మేపుతున్నాడు. కరీంనగర్‌ పట్టణంలో నివాసం ఉంటున్న ముత్తయ్య పెద్ద కుమార్తె ఇంటివద్ద ఈ నెల 12న శుభకార్యం ఉండడంతో ముత్తయ్య కొడుకు నర్సింహ ఈ నెల 11న కరీంనగర్‌కు వెళ్లిపోయాడు.

ఇదిలా ఉండగా కోడలు శైలజ తన అన్న బావమరిది అయిన నేరేడుచర్లకు చెందిన బాతుల పెంపకందారుడైన సింగం మహేశ్‌తో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో నకిరేకల్‌ మండలం ఓగోడు చెరువు కింద బాతులను మేపుతున్న మహేశ్‌.. శైలజ భర్త నర్సింహ కరీంనగర్‌కు వెళ్లిన విషయం తెలుసుకుని ఈ నెల 11న రాత్రి మాధారంకలాన్‌లోని శైలజ ఉంటున్న గుడిసె వద్దకు వచ్చాడు.

ఈ క్రమంలో కుక్కలు మొరగడంతో మామ ముత్తయ్య లేచి చూడగా శైలజ, మహేశ్‌ గుడిసెలో కలిసి ఉన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన ముత్తయ్య.. కోడలు శైలజను, ఆమె ప్రియుడు మహేశ్‌ను తిడుతూ ఉదయం విషయాన్ని ప్రజలకు చెబుతానని హెచ్చరించాడు. విషయం బయటపడుతుందని గమనించిన కోడలు శైలజ, ప్రియుడు మహేశ్‌తో కలిసి ముత్తయ్యపై దాడికి దిగారు. ముత్తయ్య ముఖంపై మహేశ్‌ తలదిండు వేసి ఒత్తిపట్టి ఊపిరాడకుండా చేయగా, శైలజ కాళ్లు, చేతులు పట్టుకుంది.

దీంతో ముత్తయ్య మృతి చెందాడు. అనంతరం ముత్తయ్య గుండెపోటుతో మృతి చెందినట్లు చిత్రీకరించారు. ఆదివారం(ఈ నెల 12) తెల్లవారుజామున కరీంనగర్‌లో ఉన్న తన భర్త నర్సింహకు ఫోన్‌చేసి మామ ముత్తయ్య గుండెపోటుతో మృతిచెందాడని తెలిపింది. ఆదివారం మాధారంకలాన్‌కు చేరుకున్న నర్సింహ తన తండ్రి ముత్తయ్య మృతదేహాన్ని తీసుకొని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో తండ్రి మృతదేహంపై గాయాలను చూసి అనుమానంతో భార్య శైలజను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పి అక్కడనుంచి పరారయ్యింది.

దీంతో కొడుకు నర్సింహ శాలిగౌరారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు మహేశ్, శైలజల కోసం గాలింపు చేపట్టారు. బుధవారం మాధారంకలాన్‌ సర్పంచ్‌ జేరిపోతుల మంజుల ఇచ్చిన సమాచారంతో నిందితులను సర్పంచ్‌ సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన దిండు, బెడ్‌షీట్లను స్వాధీనం చేసుకుని గురువారం నింది తులను కోర్టులో హాజరుపరచినట్లు డీఎస్పీ వివరించారు. శాలిగౌరారం, నకిరేకల్‌ సీఐలు పి.నాగదుర్గప్రసాద్, నాగరాజు, ఎస్‌ఐ హరిబాబు ఉన్నారు. 

చదవండి: విషాదం: పురుడు పోశారు.. ప్రాణం తీశారు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top