నిరుద్యోగమే నిప్పంటించింది! | Unemployed Youth Dies Over Not Getting Job In Khammam District | Sakshi
Sakshi News home page

నిరుద్యోగమే నిప్పంటించింది!

Jan 3 2022 1:38 AM | Updated on Jan 3 2022 1:38 AM

Unemployed Youth Dies Over Not Getting Job In Khammam District - Sakshi

రామ్‌గోపాల్‌ (ఫైల్‌) 

తల్లాడ: మోటార్‌సైకిల్‌పై వచ్చి పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ ఎన్టీఆర్‌ నగర్‌ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. అయితే ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోనే తమ కొడుకు ఈ దారుణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీనగర్‌ కాలనీకి చెందిన యడపల్లి రామ్‌గోపాల్‌ (24) మోటార్‌సైకిల్‌పై ఆదివారం మధ్యాహ్నం సమయంలో తల్లాడకు వచ్చాడు.

ఎన్టీఆర్‌ నగర్‌ సమీపంలోని రాష్ట్రీయ రహదారి నుంచి పొలాల్లోకి వెళ్లే రోడ్డులో మోటార్‌సైకిల్‌ను ఆపాడు. దానిపైనే కూర్చుని పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో మోటార్‌సైకిల్‌ పూర్తిగా కాలిపోయింది. అతడికి కూడా తీవ్రంగా మంటలు అంటుకోగా తాళలేక కాలుతున్న శరీరంతోనే రాష్ట్రీయ రహదారిపైకి పరుగులు తీశాడు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లాడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

మంటల బాధ తట్టుకోలేక కేకలు వేస్తున్న యువకుడిని ట్రాలీ ఆటోలో ఖమ్మం తరలిస్తుండగా.. మార్గమధ్యలో కొణిజర్ల వద్ద మృతి చెందాడు. సంఘటనా స్థలంలో సెల్‌ఫోన్, ఏటీఎమ్‌ కార్డు, ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐడీ కార్డు ఆధారంగా మృతుడిని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తల్లాడ ఏఎస్‌ఐ జేవీయర్‌ తెలిపారు. కాగా, తమ కుమారుడు బీటెక్‌ పూర్తి చేశాడని, ఉద్యోగం రాలేదని నిత్యం మనోవేదన చెందేవాడని, ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రామ్‌గోపాల్‌ తండ్రి పోలీసులకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement