అవమానంతో ఒకరు.. భయంతో మరొకరు

Two People Died Due To Shame In Nagarkurnool District - Sakshi

ఆత్మహత్య చేసుకున్న బావబామ్మర్దులు 

రూ.లక్ష నగదు, 2 తులాల బంగారం కోసం రెండు ప్రాణాలు బలి 

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొండారెడ్డిపల్లిలో విషాదం

వంగూరు: గ్రామంలో పదిమంది సమక్షంలో తనకు అవమానం జరిగిందని.. ఆ అవమానభారాన్ని భరించలేక బావమరిది పురుగు మందు తాగితే, తన మీద కేసు అవుతుందేమోనన్న భయాందోళనతో బావ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మల్లయ్య, రాములు అన్నదమ్ములు.

వీరి తల్లి ముత్తమ్మ కొంతకాలం కిందట అనారోగ్యంతో మృతిచెందింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ. లక్ష నగదు, రెండు తులాల బంగారం, కొంత వెండిని రాములు, మల్లయ్య పంచుకోవడంలో విభేదాలు వచ్చి మేన బావ అయిన అంజయ్య వద్ద ఉంచారు. ఇందుకు సంబంధించి గురువారం ఉదయం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ సమయంలో మల్లయ్యపై అన్న రాములు, వదిన జంగమ్మ దాడిచేశారు.

దీంతో మల్లయ్య దాడి ఘటనతోపాటు తన వాటాకు రావాల్సిన బంగారం, నగదు ఇప్పించాలని వంగూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్తుండగా.. బావ అంజయ్య తనపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశావని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఉదయం గ్రామంలో జరిగిన దాడి, సాయంత్రం బావ తిట్టిన మాటలను అవమానంగా భావించి మల్లయ్య(50) అదేరోజు రాత్రి తన పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య చెన్నమ్మ పొలంలో పడి ఉన్న భర్తను బంధువుల సాయంతో కల్వకుర్తి ఆస్పత్రికి తీసుకెళ్లింది.

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న బావ అంజయ్య (55) బామ్మర్ది మల్లయ్య చావుకు తనపై కేసు పెడతారన్న భయంతో శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. ఈ విషయాన్ని ఫోన్‌చేసి బంధువులకు చెప్పడంతో కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజయ్య కూడా మృతి చెందాడు. ఈ ఘటనలపై మల్లయ్య కొడుకు శివకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాములు, జంగమ్మలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.  

గ్రామంలో విషాదం.. 
రూ.లక్ష నగదు, బంగారం కోసం వచ్చిన విభేదాలతో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకేరోజు చనిపోవడంతో ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ఇద్దరు బావబామ్మర్దులు కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top