వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి 

TDP Leaders Attack On YSRCP Activists Denduluru - Sakshi

నలుగురికి గాయాలు

దాడిలో గాయపడ్డ ఎస్‌ఐ

దెందులూరు:  ఏలూరు జిల్లా దెందులూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతోపాటు ఎస్‌ఐ ఐ.వీర్రాజు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన టీడీపీ కార్యకర్త మోర్ల వరకృష్ణ, చోడవరపు సాయి అజయ్‌ కలిసి ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, పార్టీ మండల కన్వీనర్‌ కామిరెడ్డి నాని తదితరులపై 15 రోజులుగా సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. దీనిపై పార్టీ మండల కన్వీనర్‌ కామిరెడ్డి నాని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ నిమిత్తం మోర్ల వరకృష్ణను సాయంత్రం 4.30 గంటలకు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

అతనికి మద్దతుగా దాదాపు వందమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు దెందులూరు స్టేషన్‌కు వచ్చారు. ఈ విషయం తెలిసి శ్రీరామవరం నుంచి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, కార్యకర్తలు స్టేషన్‌కు వచ్చారు. కాగా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నట్టుండి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి.. కళ్లల్లో కారం చల్లారు. ఘటనలో శ్రీరామవరానికి చెందిన కామిరెడ్డి నాగభూషణం, కామిరెడ్డి రాజేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

దాడిలో ఎస్‌ఐ వీర్రాజు సైతం గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు నియోజకవర్గంలోని ఎస్‌ఐలు, ఏలూరు నగరంలోని సీఐలతో దెందులూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన వారు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top