సినిమా చూసి పక్కా ప్లాన్‌, అయితే డ్రైవర్‌ చాకచక్యంతో...

Roused By Bollywood Movie Men Robbed Delhi Doctor Posing As CBI Officials - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన స్పెషల్‌-26 సినిమా (తెలుగులో గ్యాంగ్‌) స్పూర్తితో ఓ డాక్టరు ఇంటిని సీబీఐ అధికారులమని చెప్పి దోచుకున్నారు దొంగలు. ఈ ఘటన మార్చి 25న ఢిల్లీలోని పితాంపురా ప్రాంతంతో చోటుచేసుకుంది. డాక్టరు ఇంటినుంచి సుమారు రూ. 36 లక్షలు , ఆభరణాలు, విదేశీ కరెన్సీని కాజేశారు.  పోలీసుల కథనం ప్రకారం.. పితాంపురాకు చెందిన డాక్టర్‌  ప్రియాంక్ అగర్వాల్ శుక్రవారం సాయంత్రం తన తండ్రి, డ్రైవర్‌తో కలిసి క్లినిక్ నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక మహిళతో సహా మరో నలుగురు నిందితులు తాము సీబీఐ అధికారులమంటూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు.

బాధిత కుటుంబ సభ్యుల నుంచి మొబైల్‌ ఫోన్లను లాక్కొని, బ్లాక్‌ మనీ ఎక్కడ అంటూ సోదా చేశారు. అందినకాడికి నగదు, ఆభరణాలు దోచుకున్నారు. డాక్టర్‌కు చెందిన‌ క్లినిక్‌ దగ్గర కూడా బ్లాక్‌మనీ కోసం వెతకాలనీ.. అతని‌ కారులోనే డాక్టర్‌ డ్రైవర్‌ని తీసుకుని అటువైపుగా వెళ్లారు. ఈ తంతంగంపై మొదటి నుంచీ అనుమానంగానే ఉన్న డాక్టర్‌ కారు డ్రైవర్‌.. వారు ప్రయాణిస్తున్న వాహనం మౌర్య ఎన్‌క్లేవ్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకోగానే గట్టిగా కేకలు వేశాడు. దీంతో అక్కడ విధుల్లో పోలీసులు అప్రమత్తమై.. కారుని ఆపు చేయించారు. కారులో ఉన్న నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు.

కారు వెంబడిస్టూ వచ్చిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధితుడు డాక్టర్‌  ప్రియాంక్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు ​చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు..  నిందితులు హర్యానాకు చెందిన బిట్టు( 32), సురేందర్ ( 35), విభ (35), అమిత్, పవన్‌ గా గుర్తించారు. అక్షయ్‌కుమార్‌ నటించిన స్పెషల్‌-26 సినిమా చూసి చోరికి పాల్పడ్డమని నిందితులు చెప్పినట్టు తెలిసింది. నిందితుల వద్ద నుంచి నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకొని, బాధిత కుటుంబానికి అప్పగించామని పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన  వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వాయువ్య మండల డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉష రంగ్నాని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top