ఇది ‘బీఎస్‌-4’ను మించిన స్కాం 

Registration Of Vehicles Fake Records Scam Bigger Than BS4 - Sakshi

సాక్షి, అనంతపురం: తప్పుడు రికార్డులతో వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసిన ‘నయాదందా’ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం రవాణా శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో జిల్లా రవాణా ఉప కమిషనర్‌ (డీటీసీ) శివరామప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. నాగాలాండ్‌లో బీఎస్‌–3 లారీలను తుక్కు కింద కొనుగోలు చేసి బీఎస్‌–4గా రిజిస్ట్రేషన్‌లు చేయించిన స్కామ్‌ను మించిన స్కాంగా ఈ ఘటనను అభివర్ణించారు. జిల్లాకు చెందిన ఓ బృందం ఖరీదైన ఇన్నోవా, షిఫ్ట్‌ కారులను మరో ప్రాంతంలో చోరీ చేసి ఇక్కడకు తీసుకొచ్చి ఆన్‌లైన్‌లోని లొసుగుల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయించిందంటూ వివరించారు.   

రూ.50 లక్షలకు పైగా అవినీతి! 
వాహనం విక్రయం మొదలు... రిజిస్ట్రేషన్‌ వరకు దాదాపు రూ.50 లక్షలకు పైగా అవినీతి ఇందులో చోటు చేసుకున్నట్లు ఉప రవాణా కమిషనర్‌ తెలిపారు. ఈ స్కాంలో బాధితులకు ఏమీ తెలియదని స్పష్టం చేశారు. దాదాపు రూ.25 లక్షలు విలువజేసే వాహనాలు రూ.10 లక్షల నుంచి రూ.15లక్షలకే అందుబాటులోకి రావడంతో వారంతా ఆశపడి కొనుగోలు చేసినట్లుగా తమ విచారణలో వెలుగు చూసిందన్నారు. ఇప్పటికే ఆరు వాహనాలను గుర్తించి, వాటి యజమానుల కోసం ఆరా తీయగా వారంత డాక్టర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, పాస్టర్, రైతులుగా తేలిందన్నారు. ఈ ఆరు వాహనాలే కాకుండా మరో 70 వాహనాల వరకూ అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లుగా తమ ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందన్నారు. వారం రోజుల్లోపు వీటి చిట్టా కూడా బయటపెడతామని పేర్కొన్నారు.  

అక్రమాలకు ఊతమిచ్చిన ‘వినోద్‌’ 
ప్రజలకు రవాణా శాఖ సేవలను మరింత వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను మొత్తం ఆన్‌లైన్‌ చేసినట్లు తెలిపారు. దీని ద్వారా కార్యాలయం చుట్టూ ఎవరూ తిరగకుండా ఇంటి పట్టునే ఉంటూ రవాణా శాఖ సేవలను పొందవచ్చునన్నారు. అయితే ఇందులో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అనంతపురం నగరంలోని వినోద్‌ ఆర్టీఏ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ సెంటర్‌ అక్రమాలకు ఊతమిస్తూ వచ్చిందన్నారు. ఇందులో పాత్రధారులైన ఇన్‌చార్జ్‌ ఆర్టీఓ మహబూబ్‌బాషా, సీనియర్‌ అసిస్టెంట్‌ మాలిక్‌బాషాను ఇప్పటికే సస్పెండ్‌ చేసినట్లు గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం స్కాంను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలో సూత్రధారులపై కూడా చర్యలు ఉంటాయని వివరించారు. 

జాగ్రత్త పడండి...  
కార్యాలయం చుట్టూ తిరగకుండానే ఆన్‌లైన్‌ ద్వారా ఆర్టీఏ సేవలను మరింత వేగవంతంగా పొందవచ్చునని ప్రజలకు డీటీసీ సూచించారు. ఈ విషయమై చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆర్టీఏకు సంబంధించి 65 రకాల సేవలను సచివాలయాలకు బదలాయించినట్లు తెలిపారు. వాహనాల కొనుగోలుపై అనుమానాల నివృత్తి కోసం రవాణా శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. విలేకరుల సమావేశంలో హిందూపురం ఆర్టీఓ నిరంజన్‌రెడ్డి, ఎంవీఐలు వరప్రసాద్, నరసింహులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top