సొంత అన్నతో వివాహేతర సంబంధం.. కూతురు అడ్డొస్తుందని..

Mother Assasinated Daughter Over Extra marital Affair With Brother At mahabubababad - Sakshi

సాక్షి, వరంగల్‌: సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ కసాయి తల్లి. తన సొంత అన్నతో వివాహేతర సంబంధం సాగిస్తూ అడ్డొస్తుందని సోదరుడితో కలిసి ఆరేళ్ల కన్న కూతురి గొంతు నులిమి కడతేర్చింది. పోలీసులు నిందితులిద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఉమ్మడి పెనుగొండ గ్రామ శివారు నర్సింహులగూడెంకు చెందిన పూనెం శిరీషకు.. ఏడేళ్ల క్రితం పెనుగొండ గ్రామ శివారు కట్టుగుడెంకు చెందిన అశోక్‌తో వివాహం జరిగింది.

వీరికి కూతురు అనూశ్రీ(6) ఉంది. శిరీష తన సొంత అన్న పూనెం కుమారస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్నాచెల్లె కలిసి ఐదేళ్ల క్రితం అనూశ్రీని తీసుకుని భువనగిరిలోని మర్రిగుడెంకు వెళ్లారు. అక్కడే పౌల్ట్రీఫాంలో పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. అనూశ్రీ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండేది.  ఆస్పత్రులకు తీసుకెళ్లే స్థోమత లేకపోవడం, పెరిగి పెద్దదైతే ఖర్చులు భరించాల్సి వస్తుంది.

పైగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని వారు భావించారు. ఈ క్రమంలో గత నెల 24న అనూశ్రీ చాతిపై తల్లి కూర్చోని గట్టిగా పట్టుకోగా కుమారస్వామి గొంతు నులిమి హత్య చేశాడు. మరుసటి రోజు మృతదేహన్ని స్వగ్రామమైన నర్సింహులగూడెం తీసుకెళ్లి కడుపునొప్పితో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశారు. గ్రామస్తులకు అనుమానం రావడంతో డయల్‌ 100కు సమాచారం అందించారు.
చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిని కారుతో ఢీకొట్టి..

పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో బాలిక గొంతు నులిమి హతమార్చినట్లు తేలింది. దీంతో పోలీసులు శిరీష, కుమారస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. మర్రిగుడెంలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసును యాదగిరి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top