- ఉత్తరప్రదేశ్‌లో ఘటన
- తల్లడిల్లిపోయిన తల్లి
కాన్పూర్: కన్న కుమార్తెలన్న ప్రేమ కూడా లేదు. అభం శుభం తెలియని పసివాళ్లన్న జాలి కూడా లేకుండాపోయింది. రాక్షసుడిలా ప్రవర్తించాడు. తన ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. ఆ తర్వాత, పోలీసులకు ఫోన్ చేసి తన కూతుళ్లను హత్య చేశానని పోలీసులకు చెప్పాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. శశి రంజన్ మిశ్రా (48) తన 11 సంవత్సరాల కవల కూతుళ్లను పదునైన ఆయుధంతో గొంతులు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున అతని ఫ్లాట్‌లో జరిగింది. శశి రంజన్ మిశ్రా మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేస్తుంటాడు.
బిహార్‌కు చెందిన అతను భార్య రేష్మా, జంట కూతుళ్లు రిద్ధి, సిద్ధి, కుమారుడు (6)తో నివసిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని శశి రంజన్ మిశ్రా అనుమానించాడు. తరచుగా ఆమె కుమారుడితో ఉండాలని, తాను కూతుళ్లను చూసుకుంటానని చెప్పేవాడు.
రేష్మా తెలిపిన వివరాల ప్రకారం.. శశి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. ఇంట్లో అనేక సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. కూతుళ్ల గదుల్లోకి ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. శనివారం రాత్రి భోజనం తర్వాత శశి కూతుళ్లను నిద్రపొమ్మన్నాడు. రాత్రి 2.30 గంటల సమయంలో ఒక కూతురిని బాత్రూమ్‌కు తీసుకెళ్లి, తిరిగి గదికి వచ్చి లైట్లు ఆపేశాడని ఆమె తెలిపింది. రెండు గంటల తర్వాత అతను పోలీసులకు కాల్ చేసి తాను హత్య చేశానని తెలిపాడు.
ఫ్లాట్‌కు చేరుకున్న పోలీసులు ఇద్దరు బాలికలు రక్తపు మడుగులో కనపడ్డారు. కాగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రేష్మా కాన్పూర్‌లో బ్యూటీ పార్లర్‌లో పని చేస్తూ శశిని కలిసింది. 2014లో వారి వివాహం జరిగింది. “శశిని అరెస్ట్ చేశాం, కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారని చెప్పారు.


