బ్లాక్‌ ఫంగస్‌ మందుల పేరుతో బురిడీ

Man Arrested For Cheating Patients Kin With Promise Of Black Fungus Medicine - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు అవసరమైన మందుల కొరతను ఆసరాగా చేసుకున్న కొందరు సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆ ఔషధాలను విక్రయిస్తామంటూ ఆన్‌లైన్‌ కేంద్రంగా నగరవాసులకు టోకరా వేశారు. ఈ తరహా నేరానికి సంబంధించిన నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న విశాఖపట్నం యువకుడిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది జూన్‌లో బ్లాక్‌ ఫంగస్‌ బారినపడ్డారు.

దీంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ రోగికి చికిత్స చేస్తున్న వైద్యులు ఎంపోటెరిసిసిన్‌–బీ సంబంధిత ఇంజెక్షన్లు తమ వద్ద లేవని, బయట కొనుగోలు చేసుకోవాలని సూచించారు. దీంతో బాధిత కుటుంబం ఇంజెక్షన్లు కావాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అది చూసి వారిని సంప్రదించిన సైబర్‌ నేరగాడు ఇంజెక్షన్ల సరఫరాకు అడ్వాన్స్‌ ఇవ్వాలంటూ రూ.40 వేలు కాజేశాడు. ఔషధం పంపని అతగాడు ఇంకా కొంత మొత్తం కోరుతుండటంతో అనుమానించిన బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. అలా లభించిన ఆధారాలను బట్టి నిందితుడిని విశాఖపట్నానికి చెందిన హేమంత్‌గా గుర్తించారు. నగరం నుంచి వెళ్లిన ఓ ప్రత్యేక బృందం బుధవారం అతడిని అరెస్టు చేసి నగరానికి తరలించింది. రిటైర్డ్‌ ఆర్మీ అధికారి కుమారుడైన హేమంత్‌ డిగ్రీ పూర్తి చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top