పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి.. వెలుగులోకి షాకింగ్‌ నిజాలు..

Lawyer Arrested Young Woman Assassination Case In Guntur District - Sakshi

పెదకాకాని(గుంటూరు జిల్లా): చెల్లెలు వరుస అయిన యువతిని మాయమాటలతో మోసం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన న్యాయవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం చిలకలూరిపేట తూర్పు మాలపల్లికి చెందిన జంగా ప్రతాప్‌ 2019 నుండి గడ్డిపాడులోని తన చిన్నమ్మ దీనకుమారి ఇంటిలో ఉంటూ లా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ప్రతాప్‌ తల్లి, దీనకుమారిలు స్వయానా అక్కచెల్లెళ్ల పిల్లలు. గడ్డిపాడులోని దీనకుమారి కుమార్తె దొడ్డా రమాదేవి సిమ్స్‌ కళాశాలలో బిఫార్మసీ చదువుతుంది.
చదవండి: పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి..

వరుసకు అక్కచెల్లెళ్ల పిల్లలు అయినప్పటికీ వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిత్యం అక్రమ సంబంధానికి దారి తీసింది. జంగా ప్రతాప్‌ రమాదేవికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించాడు. 2021 ఆగస్టు నెలలో మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన రోజు కూడా రమాదేవితో ఫోన్‌లో మెసేజ్‌ల రూపంలో సంభాషించాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంపై రమాదేవి నిలదీసింది.

వరుసకు సోదరుడైన ప్రతాప్‌ చేసిన మోసానికి మనస్థాపానికి గురై 2021 సెప్టెంబరు నెలలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫోన్‌ సంభాషణలు, మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యపోయే నిజాలు వెలుగుచూశాయి. జంగా ప్రతాప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజాన్ని అంగీకరించాడు. నిందితుడు ప్రతాప్‌ను అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్‌ విధించినట్లు పెదకాకాని సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top