కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు | Kidnapping of a boy in Varagali Tirupati district | Sakshi
Sakshi News home page

కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు

Oct 9 2024 5:47 AM | Updated on Oct 9 2024 5:47 AM

Kidnapping of a boy in Varagali Tirupati district

తిరుపతి జిల్లా వరగలిలో కలకలం 

గ్రామ సమీపంలోని ఉప్పుటేరులో మృతదేహం గుర్తింపు 

సోమవారం కిడ్నాప్‌ చేసిన ముగ్గురు వ్యక్తులు 

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు 

బాలుడితో ఇద్దరు పరార్‌.. పోలీసుల అదుపులో ఓ కిడ్నాపర్‌ 

చిల్లకూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలిలో సోమవారం కిడ్నాపైన బాలుడు లాసిక్‌ (12)... మంగళవారం సాయంత్రం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉప్పుటేరులో శవమై కనిపించడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వరగలిలోని కాతారి రమేష్, సంధ్య దంపతుల కుమారుడు లాసిక్‌ వాకాడులోని గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం తల్లిదండ్రులు నిర్వహించే దుకాణంలో ఉండగా, అక్కడకు వచ్చిన చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు గిరిజన వ్యక్తులు బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేశారు. 

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో­వైపు తల్లిదండ్రులు, బంధువులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని ఉప్పుటేరు (కండలేరు క్రీక్‌)కు ఆవలి వైపున ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం తిరుమలమ్మ పాళెం సమీపంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు మంగ­ళ­వారం సాయంత్రం అక్కడి వారు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బోట్లపై అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి తీసుకుని వచ్చారు. 

పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని, అదుపులో ఉన్న గిరిజనుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, మత్తు మందు ఇచ్చి బాలుడిని కిడ్నాప్‌ చేసి ఉంటారని.. బాలుడు స్పృహలోకి వచ్చి గొడవ చేయడంతో ఉప్పు నీటిలో పడేసి ఉంటారని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement